21 రోజులు భారత్ లాక్ డౌన్

INDIA 21 DAYS LOCK DOWN

దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడారు. ఇవాళ అర్థరాత్రి 12గంటల నుంచి దేశం మొత్తం 21 రోజులు లాక్ డౌన్ అవుతుందని మోడీ ప్రకటించారు. దేశ ప్రజలను రక్షించడానికే ఈ నిర్ణయం అని మోడీ తెలిపారు. జనతా కర్ఫ్యూ కన్నా ఎక్కువ ఆంక్షలు ఉంటాయన్నారు.21 రోజులు పాటు దేశమంతా లాక్ డౌన్ లో ఉంటుందన్నారు. ఇది కర్ఫ్యూ లాంటిదేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమలు చేయాలన్నారు. ప్రజలందరూ తమ తమ ఇళ్లకే పరిమితమవ్వాలని మోడీ కోరారు. తాను ప్రధానమంత్రిగా ఈ నిర్ణయం ప్రకటించడం లేదని,ఓ కుటుంబసభ్యుడిగా చెబుతున్నానన్నారు. రాబోయే 21 రోజులు దేశమంతా లాక్ డౌన్ ను మనం నిర్వహించలేకపోతే…21ఏళ్ల వెనక్కి మనం శిక్షించబడతామని అన్నారు. వచ్చే 21 రోజులు మనకు చాలా కీలకం అన్నారు. ఏప్రిల్ 14వరకు దేశమంతా లాక్ డౌన్ లో ఉంటుందన్నారు. ప్రతీ నగరం, ప్రతీ పట్టణం, ప్రతీ వీధి, ప్రతీ గ్రామం లాక్ డౌన్ అవుతుందన్నారు. 21 రోజుల్లో కరోనాను నియంత్రించకుంటే చాలా కుటుంబాలు కనుమరుగవుతాయన్నారు.

లాక్ డౌన్ నిర్ణయం ప్రతీ ఇంటికీ లక్ష్మణ రేఖ అని మోడీ తెలిపారు. గీత దాటితే కరోనా వైరస్ ను ఇంట్లోకి రానిచ్చినట్లేనని మోడీ తెలిపారు. కరోనా నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం లేదని ప్రధాని తెలిపారు. 67 రోజుల్లో కరోనా వైరస్ లక్షల మందికి సంక్రమిస్తే, ఆ తర్వాతి 11 రోజుల్లో కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలకు పెరిగిందని మోడీ తెలిపారు. మనం ప్రతీ దశలోనూ సహనం చూపించాల్సిన సమయమిది అని మోడీ తెలిపారు. మనం తీసుకునే చర్యలే మనల్ని విపత్తుల నుంచి కాపాడతాయన్నారు. ఈ విపత్కర పరిస్థితి పేదల జీవితాలను ఇబ్బందుల్లో పడేసిందని అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిత్యావసరాల సరుకుల సరఫరాకు ఇబ్బంది రాకుండా చూస్తున్నామని మోడీ అన్నారు.  ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వారి కోసం పోరాడాలన్నారు. కరోనా రోగుల చికిత్స కోసం 15వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు.

tags: corona virus corona effect, lock down, modi, bjp government, 21 days, central government, state government

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *