పాక్ పై ఏడోసారి…

Spread the love

INDIA BEAT PAKISTAN

  • ప్రపంచకప్ పోరులో దాయాదిపై టీమిండియా జయభేరి
  • 89 పరుగుల తేడాతో పొరుగుదేశంపై గెలుపు
  • సెంచరీతో అదరగొట్టిన రోహిత్ శర్మ

ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై టీమిండియా జైత్రయాత్ర కొనసాగింది. ఈ మెగా టోర్నీలో వరుసగా ఏడోసారి పాక్ ను చిత్తు చేసింది. ఆదివారం మాంఛెస్టర్ లో జరిగిన మ్యాచ్ లో దాయాదిపై భారత జట్టు 89 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగగా.. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ అర్థసెంచరీలు చేశారు. పలుమార్లు వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పాక్ లక్ష్యాన్ని సవరించారు. అయితే, క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ జట్టు.. 40 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 212 పరుగులు మాత్రమే చేసింది.  అంతకుముందు టాస్ గెలిచిన పాక్.. భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. వర్షం పడే అవకాశం ఉండటంతో పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, అది ఎంత తప్పుడు నిర్ణయమో మ్యాచ్ మొదలైన కొద్దిసేపటికే పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ కు అర్థమైంది. నిదానంగా ప్రారంభమైన భారత ఇన్నింగ్స్.. రోహిత్ బ్యాట్ ఝలపించడంతో స్కోర్ బోర్డు ఉరకలెత్తింది. శిఖర్ ధావన్ గాయపడటంతో అతడి స్థానంలో కేఎల్ రాహుల్ రోహిత్ కు జంటగా బరిలోకి దిగాడు. ఓ వైపు రోహిత్ చెలరేగి ఆడగా.. రాహుల్ మాత్రం ఆచితూచి ఆడాడు. ఈ క్రమంలో భారత జట్టు తొలి పది ఓవర్లల వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. అక్కడి నుంచి రోహిత్ ఒక్కసారిగా విజృంభించాడు. దీంతో కేవలం 34 బంతుల్లోనే అర్థసెంచరీ పూర్తిచేసుకున్నాడు. 24 ఓవర్లో జట్టు స్కోర్ 134 పరుగులు ఉన్నప్పుడు రాహుల్ (78 బంతుల్లో 57) తొలి వికెట్ గా ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ స్కోర్ బోర్డును ఉరకలెత్తించాడు.

ఈ క్రమంలో రోహిత్ 85 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. అనంతరం ధాటిగా ఆడే క్రమంలో 234 పరుగుల వద్ద రోహిత్ శర్మ (113 బంతుల్లో 140) రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. హార్థిక్ పాండ్యా (19 బంతుల్లో 26) మెరుపులు మెరిపించినప్పటికీ, ధోని (0) విఫలమయ్యాడు. కోహ్లీ (65 బంతుల్లో 77) కూడా ఔట్ కావడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్ 46 ఓవర్లో వరుణుడు ఓసారి మ్యాచ్ కు అంతరాయం కలిగించాడు. అనంతరం 337 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టుకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఇమామ్‌(7) త్వరగా ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్‌ ఫఖర్‌.. బాబర్‌ అజమ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ నడిపించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 100 పరుగులు జోడించారు. ఈ నేపథ్యంలో కులదీప్ వీరిద్దరినీ ఔట్ చేశాడు. వరుస ఓవర్లలో బాబర్‌(48), ఫఖర్‌(62) లను ఔట్‌ చేయడంతో మ్యాచ్ పూర్తిగా భారత్ చేతిలోకి వచ్చేసింది. అనంతరం వచ్చిన హఫీజ్‌(9), మాలిక్‌(0)లను హార్దిక్‌ వెనక్కి పంపించడంతో భారత విజయం లాంఛనమే అయింది. సర్ఫరాజ్‌(12) కూడా విఫలం కావడంతో ఇక పాక్ కోలుకోలేదు. అయితే 35 ఓవర్ల వద్ద వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఆ సమయానికి పాక్ 6 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. వర్షం తగ్గాక మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించి పాక్‌ లక్ష్యాన్ని 302 పరుగులుగా నిర్ణయించారు. అయితే అసాధ్యమైన లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసి ఓటమిపాలైంది. భారత బౌలర్లలో కుల్దీప్‌, విజయ్‌, హార్దిక్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. సెంచరీతో కదం తొక్కిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *