మన దేశం మరో వెనిజులా కానుందా?

Spread the love

INDIA BECOME ANOTHER VENEZUELA?

ఒకప్పుడు వెనిజులా ప్రపంచంలోని ముందు వరుసలో ఉన్న అనేక ధనిక దేశాలలో 20వ స్థానంలో ఉంది. సహజవనరులతో సుసంపన్నంగా ఉండి, పచ్చని ప్రకృతితో అలరారి , చమురు నిక్షేపాలతో అత్యంత‌ వైభవంగా ఒక వెలుగు వెలిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ప్రస్తుత వెనిజులా పరిస్థితిని చూస్తే భవిష్యత్తులో మనకు కూడా ఇటువంటి ఇబ్బందులు వస్తాయా అన్న అనుమానం కలుగకమానదు. పదవి వ్యామోహంతో పాలకులు చేసే పనులు, ఆచరణ సాధ్యం కానీ హామీలు మన దేశాన్ని కూడా ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వెనిజులా గా మార్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఆర్థిక సంక్షోభమే అస‌లు స‌మ‌స్య‌?
వెనిజులా ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మౌలిక సదుపాయాలు కూడా కల్పించుకోవాలని దయనీయమైన స్థితిలో ఉంది. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయలేని దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీనికి కారణం పాలకులు. వెనిజులా ను పరిపాలించిన సోషలిస్టు మార్క్సిస్టు భావజాలంతో విధానాలు రూపొందించి పూర్వపు అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ కొంతకాలం పరిపాలించాడు. ఆరోజుల్లో ఆ దేశపు ప్రధాన వనరు చమురుకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర పలికింది. దాంతో డాలర్ల వర్షం కురిసింది. దాంతో అనేక పథకాలను ప్రారంభించి కొనసాగించారు. వామపక్ష భావజాలం మత్తులో ముందు చూపులేకుండా చాలా వరకు ఉచితాలను ప్రవేశపెట్టారు. అనంతరం చమురు ధరలు తగ్గడంతో ఆదాయం బాగా పడిపోయింది. గతంలో ప్రవేశపెట్టిన ఉచితాలకు అలవాటుపడిన ప్రజల నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. పని చేసేవారు తగ్గిపోయి, కూర్చుని తినేవారు పెరిగిపోయారు. ఎక్కడికి అక్కడ దోపిడీ పెరిగిపోయింది. ఆదాయం తగ్గింది, ఖర్చు పెరిగింది. ద్రవ్యోల్బణం క్రమంగా పెరగ సాగింది. ప్రజల్లో అసహనం-అశాంతి అదేస్థాయిలో పెరిగింది. దీన్ని ప్రతి పక్షాలు ఖండిస్తూ  హ్యూగో చావెజ్‌ రూపొందించిన విధానాలను, ఆ విధానాలనే కొనసాగిస్తున్న ఆయన శిష్యుడు మదురోను విమర్శిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

మ‌దురో అస్స‌లు మార‌డు!

మదురో తన సోషలిస్టు విధానాలను మార్చుకునేందుకు సిద్ధంగా లేడు. ఆర్థిక పరిస్థితి బాగుపడాలంటే మార్కెట్‌ ఎకానమీ వైపు కదలాలన్న ప్రతిపక్షాలకు ప్రజలు మద్దతు పలుకుతున్నారు. దాంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం క్రమక్రమంగా పెరుగుతూ ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. హింసాత్మక సంఘటనలూ పెరుగుతున్నాయి. దోపిడీలు, దొమ్మిలు నిత్యకృత్యమయ్యాయి. ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర సరుకులు ప్రజలకు అందకుండాపోయాయి. అత్యవసర మందులు సైతం అందుబాటులో లేకపోవడంతో ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఈ పరిస్థితిని తట్టుకోలేక లక్షలాది మంది ప్రజలు ఇప్పటికే వేరే దేశాలకు వలసలు పోయారు. గత ఆగస్టులో నూతన కరెన్సీని ప్రవేశపెట్టి ఆర్థిక ఉద్దీపనకు పాల్పడినా పరిస్థితుల్లో పెద్ద మార్పురాలేదు. ఈ నేపథ్యంలో సైనిక తిరుగుబాటుకు ఆలోచనలు జరిగాయి. ఇలాంటి అనేక విపత్కర పరిస్థితుల మధ్యఈ సంవత్సరం జనవరి 5న అధ్యక్షుడు నికోలస్‌ మదురోను చట్టవిరుద్ధ (ఇల్లిజిటిమేట్‌)గా జాతీయ చట్టసభ ప్రకటించింది. అప్పటి నుంచి లాటిన్‌ అమెరికాలోని ఆ దేశంలో సంక్షోభం తారాస్థాయికి చేరుకుని వీధి పోరాటాలు జరిగాయి. అనేక మంది ప్రజలు మరణించారు. ప్రతిపక్షనాయకుడు జువాన్‌ గుయాడో తనకు తాను దేశాధ్యక్షునిగా ప్రకటించుకున్నారు. మార్క్సిజం మూలసూత్రాలను నమ్ముకున్న నికోలస్‌ మదురో దేశంలోని దాదాపు 90 శాతం ప్రజలు పేదరికంలో కొనసాగేందుకే ఇష్టపడటం ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు అవసరమైన చర్యలకు ఆసక్తి ప్రదర్శించకపోవడం దారుణం. మదురో హయాంలో అమెరికా డాలర్‌తో వెనిజులా కరెన్సీ అయిన బొలివర్‌ విలువ 90 శాతానికి పైగా పడిపోయిందంటే అక్కడి పరిస్థితులను ఎవరైనా ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

వెనిజులా తాజా పరిస్థితిని చూస్తే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాజకీయ నాయకుల పుణ్యమాని మనదేశంలో వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే నాయకులు మారాలి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉచిత పధకాలు అందిస్తూ ప్రజలను సోమరిపోతులు చేసే వ్యవస్థలో మార్పు రావాలి. ప్రభుత్వం అందించే ఏ పథకమైనా అది ప్రజాధనాన్ని ఖర్చు చేసేది అని ప్రజలంతా గుర్తించాలి. దేశ ఆర్థిక పరిస్థితి వెనిజులా తరహాలో దయనీయంగా తయారు కాకుండా ఉండాలంటే ప్రజలు సైతం ఎన్నుకునే నాయకులను వారిచ్చే ఉచిత పథకాలను చూసి కాకుండా, వారి పాలనా సామర్థ్యాన్ని చూసి మాత్రమే ఎన్నుకోవాలి. అలా ఎన్నుకుంటే వెనిజులాలా మరే దేశం మారకుండా ఉంటుంది.

Venezuela Latest Updates

– DR. VEENA SRINIVAS, SENIOR JOURNALIST

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *