చివరి మ్యాచ్ లోనూ చేతులెత్తేశారు

Spread the love

INDIA LOST LAST ODI

  • ఆసీస్ తో ఆఖరి వన్డేలో టీమిండియా పరాజయం
  • 3-2 తేడాతో సిరీస్ కంగారూల కైవసం
  • ఖవాజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్

సిరీస్ వశం చేసుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా చేతులెత్తేసింది. ఆస్ట్రేలియాతో బుధవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన నిర్ణయాత్మకమైన చివరి వన్డేలో భారత్‌ 35 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. నాలుగో వన్డేలో బ్యాట్స్ మెన్ రాణించి, బౌలర్లు విఫలం కాగా.. ఈ మ్యాచ్ లో బౌలర్లు రాణించి, బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. సరైన సమయంలో కీలకమైన బ్యాట్స్ మెన్లు చేతులెత్తేయడంతో భారత్ కు ఓటమి తప్పలేదు. దీంతో ఐదు వన్డేల సిరీస్ ను 3-2 తేడాతో ఆసీస్ కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఓపెనర్ ఖవాజా (100, 106 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్ లు) సెంచరీతో కదం తొక్కాడు. ఫించ్ (27)లో కలిసి తొలి వికెట్ కు 76 పరుగుల భాగస్వామ్యం, హ్యాండ్స్ కోంబ్ (52)లో కలిసి రెండో వికెట్ కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో 33 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 175 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఆసీస్.. అనంతరం వడివడిగా వికెట్లు పోగొట్టుకోవడంతో స్కోర్ వేగం నెమ్మదించింది. ఓ దశలో ఆసీస్ స్కోర్ 300 పరుగులు దాటడం ఖాయంగా కనిపించింది. అయితే, భారత బౌలర్లు గాడిలో పడి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు తీయడానికి ఆసీస్ బ్యాట్స్ మెన్ ఇబ్బంది పడ్డారు. చివర్లో రిచర్డ్ సన్ 29 (21 బంతుల్లో), కమిన్స్ 15 (8 బంతుల్లో) బ్యాట్ ఝలిపించడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ మూడు వికెట్లు తీయగా.. షమీ, జడేజాలు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశాడు.

అనంతరం 273 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోర్ 15 వద్ద ఉన్నప్పుడు శిఖర్ ధావన్ (12) ఔట్ అయ్యాడు. అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లి (20), రిషభ్ పంత్ (16), విజయ్ శంకర్ (16) విఫలం కావడంతో 120 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా, మరోవైపు రోహిత్ శర్మ ఆచితూచి ఆడటంతో గెలుపుపై భారత్ ఆశలు వదులుకోలేదు. అర్థసెంచరీ పూర్తిచేసుకున్న తర్వాత రోహిత్ 56 (89 బంతుల్లో 4 ఫోర్లు) ఔట్ కావడం, వెంటనే రవీంద్ర జడేజా డకౌట్ కావడంతో 132 పరుగులకు టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయి మరిన్ని కష్టాల్లో కూరుకుపోయింది. అయితే, ఈ దశలో కేదార్ జాదవ్ (44, 57 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), భువనేశ్వర్ (46, 54 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లు) ఏడో వికెట్ కు 91 పరుగులు జోడించడంతో భారత్ కు ఏ మూలో ఆశలు చిగురించాయి. అయితే, వెంటవెంటనే వీరిద్దరూ ఔట్ కావడంతో భారత్ ఓటమి ఖరారైంది. చివరి బంతికి కుల్దీప్ యాదవ్ బౌల్డ్ కావడంతో టీమిండియా 237 పరుగులకు ఆలౌట్ అయింది. సిరీస్‌ మొత్తం రాణించిన ఖవాజాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌తో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు కూడా దక్కింది.

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *