భారతదేశానికి అర్జంటుగా ఆర్థిక మంత్రి కావాలి

INDIA NEEDS GOOD FINANCE MINISTER

  • సగటు భారతీయుల ఆవేదన ఇది
  • ఐదు శాతానికి భారత జీడీపీ
  • చైనా కంటే దిగజారిన ఆర్థిక వ్యవస్థ 

ఔను.. నిజమే.. భారతదేశానికి అర్జంటుగా ఆర్థిక మంత్రి కావాలి. పాపం నిర్మలక్క ఏం చేస్తుంది? మోడి, అమిత్ షాలు చెప్పినట్లే వింటుంది. అంతే తప్ప సొంత నిర్ణయాలు తీసుకోలేదు కదా.. కాబట్టి, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లే అటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు ఒక మంచి ఆర్థిక మంత్రి అర్జంటుగా కావాలి.

అయ్యా మోడీ, అమిత్ షా.. ఇక మీ రాజకీయాలు బందు చేయండి. ప్రతి రాష్ట్రంలో పాగా వేయడానికి స్కెచ్ లు వేయడం నిలిపివేయండి. విద్వేషపూరిత ప్రసంగాలతో ప్రజల్లో అల్లకల్లోలం రేపడం ఆపేయండి. తుగ్లక్ నిర్ణయాలతో దేశాన్ని, దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చకండి. మీ పుణ్యమా అంటూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రావట్లేదంట.. అసలెందుకు ఇలా జరుగుతుందో ఆరా తీయండి. పరిష్కారాలు కనుగొనండి. జీడీపీ విషయానికి వస్తే.. గత ఆరేండ్లలో కనిష్ఠ స్థాయికి చేరింది. ఏప్రిల్- జూన్ నెలలో ఐదు శాతంగా నమోదు అయ్యింది. దేశ ఆర్థిక వ్యవస్థ ఇంతగా కుంటుపడుతున్నా.. మీరు మాత్రం దక్షిణాది రాష్ట్రాల్లో పాగా ఎలా వేయాలనే స్కెచ్చుల మీద స్కెచ్చులు వేస్తూనే ఉన్నారు. అయ్యా.. మీ ఇద్దరూ ఇద్దరే. ఎవరి మాట వినరు. పోనీ, మీరేమైనా సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారా? అంటే అదీ లేదు. ఇలాగైతే, దేశ ఆర్థిక పరిస్థితి ఏమి కావాలి? మీ ఇద్దరికీ ముఖ్యమంత్రి, హోం మంత్రిగా చేసిన అనుభవాలు మీ ఇద్దరికీ ఉన్నాయి. కానీ, ఒక మంచి ఆర్థిక మంత్రిని పెట్టుకోండి. మీ పరిపాలన చూస్తుంటే రాజీవ్ గాంధి మరణించిన తర్వాత దేశ ఆర్థిక పరిస్థితులు ఎంతగా దిగజారాయో.. అవే గుర్తుకొస్తున్నాయి. కనీసం, ఇప్పటికైనా మీ సొంత నిర్ణయాలు ప్రజల మీద రుద్దేయకుండా.. ఆర్థిక నిపుణుల సూచనలు, సలహాలు తీసుకోండి. వారు చెప్పిన విషయాలను తప్పకుండా పాటించండి. యావత్ భారతావనిని ఆర్థికంగా బలోపేతం చేయండి.

గుజరాత్ మెరుపులు ఏమయ్యాయి?
గుజరాత్ ని అభివ్రుద్ధి చేసినట్లే దేశం రూపురేఖలు మారుస్తానని అన్నారు. వెలుగుజిలుగులతో రంగులమయం చేస్తామన్నారు. ప్రతి భారతీయుడు ఆనందంగా గడిపే రోజులు తెస్తామన్నారు. ఇవన్నీ మీరు కేంద్రంలో అధికారంలోకి రాకముందు చేసిన ప్రచారం. అప్పటికే రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై చిర్రెత్తుకొచ్చి మేమంతా మిమ్మల్ని ఎన్నుకున్నాం. కానీ, ఈ ఆరేళ్లలో మీరేం చేశారు? ఏం చేస్తున్నారు? మీరు చెప్పిన మేకిన్ ఇండియా ఏమైంది? ప్రచారానికే సరిపోయిందా? అందుకేనేమో మన దేశంలో తయారీ రంగం పూర్తిగా క్షీణించింది. టాటా స్టీలు వంటి సంస్థలు హాలీడేలు ప్రకటిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో స్తబ్దత ఏర్పడింది. ప్రైవేటు రంగంలో పెట్టుబడులు క్షీణించాయి. వినియోగదారుల కొనుగోళ్ల శక్తి తగ్గుముఖం పట్టింది. మొత్తానికి, ఈ ఏడాది ప్రథమ త్రైమాసికంగా దేశ స్థూల జాతీయోత్పత్తి గత ఆరేళ్లలో కనిష్ఠ స్థాయికి చేరుకుంది. ప్రపంచంలో అతి వేగంగా అభివ్రుద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనే ట్యాగ్ మనం ఈ  ఏడాది కోల్పోయాం. ఎంత దుస్థితి? గత 27 ఏళ్లలో చైనాతో పోల్చితే ఇదే అత్యంత తక్కువగా నమోదైన జీడీపీ. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనంతో జీడీపీ పడిపోయిందని మీ భజన బ్యాచు చెప్పొచ్చు గాక. కనీసం, ఇప్పటికైనా ఆర్థిక మంత్రిత్వ శాఖను పటిష్ఠం చేసి.. మీ సొంత నిర్ణయాల్ని పక్కన పెట్టి.. అనుభవజ్నులైన ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకుని.. దేశానికి ముందుకు తీసుకెళ్లండి. అందుకే, ఒక మంచి ఆర్థిక మంత్రిని నియమించుకోండి. మా ఈ భారతదేశానికి ప్రస్తుతం ప్రధానమంత్రి కాదు.. ఆర్థిక మంత్రి కావాలి.

INDIA GDP VERY LOW

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *