భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్?

10

భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మళ్లీ ద్వైపాక్షిక సిరీస్ జరగబోతోందా? ఇందుకు ఈ ఏడాదే ముహూర్తం కుదిరిందా? అంటే పాక్ మీడియా ఔననే అంటోంది. భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్ అంటే ఎంతటి టెన్షన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగి కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అందుకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంలేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే రెండు దేశాల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ తరుణంలో భారత్, పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగబోతోందని, ఈ మేరకు సిద్ధంగా ఉండాలని పాక్ క్రికెట్ బోర్డుకు ఆ దేశ అత్యున్నత రాజకీయ వర్గాల నుంచి సమాచారం వచ్చిందనే వార్త పాక్ మీడియా వెల్లడించింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ పర్యటన ఉండే అవకాశం ఉందని పేర్కొంది.