ఉత్కంఠ రేపుతున్న టీం ఇండియా

Spread the love

INDIA VS KIWIS SEMIS ANALYSIS

క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్ తొలి సెమీఫైన‌ల్ ఆరంభం కాబోతోంది. తొలి సెమీఫైన‌ల్‌లో భార‌త జ‌ట్టు.. న్యూజిలాండ్‌తో త‌ల‌ప‌డ‌బోతోంది. మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియం వేదిక‌గా ఈ మ్యాచ్ భార‌త కాలమానం ప్ర‌కారం మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆరంభం కాబోతోంది. ప్ర‌స్తుతానికి గెలుపు అవ‌కాశాలు టీమిండియా వైపే ఉన్నాయ‌న‌డంలో సందేహాలు అన‌వ‌స‌రం. దీనికి ప్ర‌ధాన కార‌ణం- రౌండ్ రాబిన్ లీగ్ ద‌శ‌లో టీమిండియా సాధించిన ఘ‌న విజ‌యాలే, ఆట‌గాళ్లు ఫుల్ ఫామ్‌లో ఉండ‌ట‌మే, ఎదురుగా ఎలాంటి జ‌ట్టు ఉన్నా, ఎలాంటి వ్యూహాలు ప‌న్నినా తుక్కు రేగ్గొట్ట‌డ‌మే!

ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల‌ల్లో ఏడింటిని త‌న ఖాతాలో వేసుకుంది కోహ్లీసేన‌. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో చివ‌రికంటా పోరాడి, ఓడిపోయింది. వ‌ర్షం వ‌ల్ల ఓ మ్యాచ్ ర‌ద్ద‌యింది. నిజానికి- న్యూజిలాండ్ జ‌ట్టును లీగ్ ద‌శ‌లోనే టీమిండియా ఎదుర్కొని ఉండాల్సింది. వ‌రుణుడి రాక వ‌ల్ల ఆ మ్యాచ్ తుడిచిపెట్టుకుని పోయింది.తొలి సెమీఫైన‌ల్‌లో ఎంత‌మంది బౌల‌ర్లు ఉండాల‌నేది ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.ఐదుగురు బౌల‌ర్ల‌తో దిగాలా? లేక ఆరుమంది స్పెష‌లిస్టుల‌ను తీసుకోవాలా? అనే విష‌యంపై టీమ్ మేనేజ్‌మెంట్ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. కూడిక‌లు, తీసివేత‌ల‌తో కుస్తీ ప‌డుతోంది. ప్ర‌స్తుతం టీమిండియా బౌలింగ్ విభాగం బ‌లంగా ఉంది. జ‌స్‌ప్రీత్ బుమ్రా, మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, హార్దిక్ పాండ్య‌, కుల్‌దీప్ సింగ్‌, య‌జువేంద్ర చాహ‌ల్ రెగ్యుల‌ర్ బౌల‌ర్లు. వారికి 10 ఓవ‌ర్ల కోటాను విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌గ‌ల స‌త్తా వారికి ఉంది. ఇంత‌మంది బౌల‌ర్ల‌ను ఆడించే అవ‌కాశం సెమీస్‌లో దాదాపు ఉండ‌క‌పోవ‌చ్చు. ఫాస్ట్ బౌల‌ర్ల‌లో ఒక‌రిని, స్పిన్‌లో ఇంకొక‌రిని ప‌క్క‌న పెట్టాల్సి రావ‌చ్చు. లేదా ఆరుమందిని తుదిజ‌ట్టులోకి తీసుకుంటే.. ఓ బ్యాట్స్‌మెన్‌ను ప‌క్క‌న పెట్టాల్సి ఉంటుంది.

నిజానికి- మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ, భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఇద్ద‌రూ టీమిండియాకు ప్ర‌ధాన బౌల‌ర్లు. ఇద్ద‌రూ జ‌ట్టుకు అపూర్వ విజ‌యాల‌ను అందించిన వారే. ఇప్పుడు వారిద్ద‌రి మ‌ధ్యే పోటీ నెల‌కొంది. ఎవ‌రో ఒక‌ర్ని త‌ప్ప‌నిస‌రిగా ప‌క్క‌న పెట్టాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. ఎవ‌ర్ని తీసేయాలి? ఎవ‌ర్ని ఆడించాలి? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. భువ‌నేశ్వ‌ర్ కుమార్‌తో పోల్చుకుంటే- ప్ర‌స్తుత ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో 14 వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. ఇందులో ఓ హ్యాట్రిక్ కూడా న‌మోదైంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారీగా ప‌రుగులు ఇచ్చుకున్న‌ప్ప‌టికీ.. అయిదు వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ప్ర‌స్తుతం అత‌ని ఫామ్ అలాగే కొన‌సాగుతూ వ‌స్తోంది. టీమిండియా ప్ర‌ధాన బౌల‌ర్ భువి. కాలి కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో పాకిస్తాన్‌తో మ్యాచ్ నుంచి అర్ధాంత‌రంగా వైదొలిగాడు. ఆ త‌రువాత నాలుగు మ్యాచ్‌ల‌కు అందుబాటులో లేకుండాపోయాడు. శ్రీలంక‌తో ఆడిన చిట్ట‌చివ‌రి లీగ్ మ్యాచ్ సంద‌ర్భంగా జ‌ట్టులో పునఃప్ర‌వేశించాడు. లంకేయుల‌పై ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయాడు. తోటి బౌల‌ర్లు లంక బ్యాట్స్‌మెన్ల‌ను క‌ట్టి ప‌డేస్తున్న‌ప్ప‌టికీ.. భువి మాత్రం ధారాళంగా ప‌రుగులు స‌మ‌ర్పించేసుకున్నాడు. ఎంత‌గా అంటే ఓవ‌ర్‌కు ఏడుకు పైగా ప‌రుగులు ఇచ్చేశాడు. త‌న 10 ఓవ‌ర్ల కోటాలో 73 ప‌రుగుల‌ను ఇచ్చుకున్నాడు భువి. ఈ మ్యాచ్‌ను అడ్డుగా పెట్టుకుని- భువిని బెంచ్‌పై కూర్చోబెడ‌తార‌ని అనుకోవ‌డానికి కూడా వీల్లేని ప‌రిస్థితి.

స్పిన్న‌ర్ల‌లో కుల్‌దీప్ యాద‌వ్‌, య‌జువేంద్ర చాహ‌ల్‌.. ఎవ‌రో ఒక‌ర్ని ప‌క్క‌న పెట్టాల‌ని యోచిస్తోంది టీమిండియా. వారిలో ఎవ‌రికి మ్యాచ్ ఆడే అవ‌కాశం ద‌క్కుతుంద‌నేది తేల‌ట్లేదు. శ్రీలంక‌తో మ్యాచ్‌లో య‌జువేంద్ర చాహ‌ల్‌ను తుదిజ‌ట్టులోకి తీసుకోలేదు. చాహ‌ల్ స్థానంలో ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జడేజాను ఆడించారు. కుల్‌దీప్ సింగ్ కూడా శ్రీలంక‌తో మ్యాచ్‌లో తేలిపోయాడు. స్పిన్‌ను ఆడ‌గ‌ల జ‌ట్టు ఎదురైతే మ‌న వాళ్లు చేతులెత్తేస్తున్నార‌న‌డానికి ప్ర‌పంచ‌క‌ప్ చివ‌రి మూడు లీగ్ మ్యాచులే నిద‌ర్శ‌నం. ఇంగ్లండ్ ఆట‌గాళ్లు ఈ ఇద్ద‌రు స్పిన్న‌ర్ల‌ను ఎలా దంచి ప‌డేశారో చూశాం. శ్రీలంక‌తో మ్యాచ్‌లో కుల్‌దీప్ సింగ్ త‌న 10 ఓవ‌ర్ల కోటాలో 58 ప‌రుగులు ఇచ్చుకున్నాడు. ఒక వికెట్‌ను మాత్ర‌మే తీసుకున్నాడు. ఈ నేప‌థ్యంలో స్పిన్న‌ర్ల‌ను న‌మ్ముకుని బ‌రిలో దిగ‌లేని ప‌రిస్థితిని కొనితెచ్చుకుంది టీమిండియా.

#INDIAVSNEWZEALAND

#INDVSKIWISSEMIFINALS

#VIRAT, #ROHIT, #KLRAHUL #DHONI

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *