భార‌తే ఫైన‌ల్ చేరుతుంది.. ఎలాగంటే?

India vs New Zealand Semifinal Updates

ప్రపంచకప్‌ సమరం చివరి అంకానికి చేరుకుంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ వేదికగా మంగళవారం మధ్యాహ్నం పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలోని భారత్‌.. నాలుగో స్థానంలోని న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ జరుగనుంది. ఆడిన ఎనమిది మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో భారత్‌ ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీస్ చేరింది. టైటిల్‌ ఫేఫేవరెట్‌లలో ఒకరిగా బరిలోకి దిగిన భారత్‌ ప్రస్థానం సెమీఫైనల్‌ వరకు రాజసంగా సాగింది. ఆతిథ్య ఇంగ్లండ్‌ చేతిలో పరాజయం, వర్షం కారణంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ రద్దు కావడం మినహా మిగతా ఏడు మ్యాచ్‌ల్లో భారత్‌ అదరగొట్టింది.

మరోవైపు న్యూజిలాండ్ ప్రయాణం మాత్రం బిన్నంగా సాగింది. ఈ ప్రపంచకప్‌లోనూ న్యూజిలాండ్‌ ఆరంభంలో అదరగొట్టింది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఆ జట్టుకు పరాజయం ఎదురుకాలేదు. అయితే పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో జరిగిన చివరి మూడు మ్యాచ్‌ల్లో కివీస్‌ జట్టుకు ఓటమి ఎదురైంది. ఇంగ్లండ్‌పై భారత్ గెలిచుంటే పాకిస్థాన్ సెమీస్ వచ్చేది. కానీ.. కివీస్‌కు అదృష్టం కలిసొచ్చి సెమీస్ చేరింది. బలబలాల పరంగా ప్రత్యర్థి కంటే ఎంతో మెరుగ్గా కనిపిస్తున్నభారత్‌కే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఐసీసీ టోర్నీలో అనూహ్య ప్రదర్శన కనబర్చడం అలవాటుగా మార్చుకున్న కివీస్‌ అంత సులువుగా లొంగుతుందా అనేది మాత్రం చూడాలి.

ప్రపంచకప్‌లో భారత్, న్యూజిలాండ్‌ జట్లు ఏడు సార్లు తలపడ్డాయి. నాలుగు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ గెలిచింది. మూడు మ్యాచ్‌ల్లో భారత్‌కు విజయం సాధించింది. ఈ రెండు జట్లు 2003 తర్వాత మళ్లీ ఓ ప్రపంచకప్‌ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. 2003 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌ ఏడు వికెట్లతో గెలిచింది.గత కొన్ని మ్యాచ్‌లలో ఓల్డ్ ట్రఫోర్డ్ పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. టాస్‌ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్‌ చేయడం ఖాయం. వికెట్ బ్యాటింగ్‌తో పాటు పేస్‌కు అనుకూలం. అయితే భారీ స్కోర్లకు అవకాశం ఉంది. భారత్‌ ఇప్పటికే ఇక్కడ పాక్, విండీస్‌లపై గెలవగా.. కివీస్‌ చేతిలో విండీస్‌ త్రుటిలో ఓడింది. మ్యాచ్‌కు వర్ష సూచన ఉందని బ్రిటన్ వాతావరణ శాఖ అంటోంది. తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

స్టార్ ఓపెనర్ శిఖర్‌ ధావన్, విజయ్‌ శంకర్‌ గాయాలతో మధ్యలోనే వైదొలిగినా.. వారి నిష్క్రమణ ప్రభావం భారత్‌ ప్రదర్శనపై అంతగా పడలేదు. ఓపెనర్ రోహిత్‌ శర్మ ఐదు సెంచరీలతో భీకరమైన ఫామ్‌లో ఉండటం పెద్ద ఊరట. మరో ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ శతకంతో ఫామ్‌లోకి రావడం.. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ నిలకడతో టాపార్డర్‌ పటిష్టంగా ఉంది. సెమీఫైనల్లో టాపార్డర్‌ ప్రదర్శన కీలకం కానుంది. భారత్‌ భారీ స్కోరు చేయాలన్నా.. లక్ష్య ఛేదన సాఫీగా సాగాలన్నా రోహిత్, రాహుల్, కోహ్లీలలో ఒకరు మరోసారి భారీ ఇన్నింగ్స్‌ ఆడాల్సిందే. అయితే ఇప్పటి వరకు భారత మిడిలార్డర్‌కు సరైన పరీక్ష ఎదురుకాలేదు. రిషబ్ పంత్, ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా చెలరేగాల్సిన అవసరం ఉంది. పిచ్‌ను బట్టి అవసరమైతే ప్రత్యామ్నాయ స్పిన్నర్‌గా పనికొస్తాడు కాబట్టి దినేశ్‌ కార్తీక్‌ స్థానంలో కేదార్‌ జాదవ్‌ తిరిగి రావచ్చు.పేసర్ బుమ్రాతో కొత్త బంతి భాగస్వామి ఎవరు అన్నదే ఇప్పుడు ప్రశ్న. పేసర్‌ భువనేశ్వర్‌ గాయంతో దూరమవడంతో జట్టులో కొచ్చిన షమీ.. ఆడిన 4 మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు తీసాడు. భువీ ఐదు మ్యాచ్‌ల్లో 7 వికెట్లే పడగొట్టాడు. ఇద్దరు పరుగులు సమర్పించుకుంటున్నారు. డెత్‌ ఓవర్లలో వీరి బౌలింగ్‌ నిరాశపరుస్తోంది. అయితే మాంచెస్టర్‌లో ఇప్పటిదాకా జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో పేసర్లదే కీలక పాత్ర. దీంతో ముగ్గురు ప్రధాన పేసర్లతో బరిలోకి దిగొచ్చు. అదే జరిగితే దినేశ్‌ కార్తీక్‌ స్థానంలో ఆఫ్‌ స్పిన్‌ కూడా వేయగల జాదవ్‌ జట్టులోకి రావొచ్చు. జడేజా బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి కొనసాగే అవకాశం ఉంది. కివీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎక్కువ మంది కుడిచేతి బ్యాట్స్‌మెన్‌ ఉండడంతో చాహల్‌, కుల్దీప్‌లలో ఒకరే బరిలోకి దిగే అవకాశం ఉంది.

న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ బలహీనంగా కనిపిస్తోంది. కెప్టెన్‌ విలియమ్సన్‌ మినహా మిగతా వారంతా అంతంత మాత్రంగానే ఆడుతున్నారు. విలియమ్సన్‌ ఒక్కడే కివీస్‌ చేసిన మొత్తం పరుగుల్లో 28.73 శాతం (481) సాధించాడు. అంటే ఇతన్ని త్వరగా ఔట్ చేస్తే చాలు. సీనియర్‌ రాస్‌ టేలర్‌ కూడా వరుసగా విఫలమవుతుండటం తీవ్ర ప్రభావం చూపుతోంది. గప్టిల్‌ ఘోరంగా ఆడుతుండగా.. రెండో ఓపెనర్‌గా మున్రో, నికోల్స్‌లను ఆడించినా ఇద్దరూ చేతులెత్తేశారు. మిడిలార్డర్‌లో కీపర్‌ లాథమ్‌ గత మ్యాచ్ ద్వారా ఫామ్ చాటాడు. ఆల్‌రౌండర్లుగా నీషమ్, గ్రాండ్‌హోమ్‌ బ్యాట్ జులిపించడానికి సిద్ధంగా ఉన్నారు.మేఘావృతమైన వాతావరణంలో ప్రధాన పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను ఎదుర్కోవడం భారత ఓపెనర్లకు సవాలుతో కూడుకున్న పనే. తొడ కండరాలు పట్టేయడంతో గత మ్యాచ్‌కు దూరమైన పేసర్ ఫెర్గూసన్.. సౌతీ స్థానంలో తిరిగి జట్టుతో చేరడం కివీస్ బలాన్ని రెట్టింపు చేసేదే. నీషమ్, గ్రాండ్‌హోమ్‌ ఉన్నారు కాబట్టి మూడో పేసర్‌ హెన్రీ స్థానంలో లెగ్‌ స్పిన్నర్‌ సోధికి అవకాశం ఇవ్వాలని కివీస్ ఆలోచిస్తోంది.

రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌, ఎంఎస్ ధోనీ, దినేష్ కార్తీక్‌/ కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్, యజువేంద్ర చాహల్‌/భువనేశ్వర్‌ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ లు భారతజట్టులో ఉంటారని తెలుస్తుంది. ఇక న్యూజిలాండ్ జట్టులో మార్టిన్ గప్తిల్‌, కొలిన్ మన్రో, కేన్ విలియమ్సన్‌, రాస్ టేలర్‌, టామ్ లేథమ్‌, జిమ్మీ నీషమ్‌, కొలిన్ గ్రాండ్‌హోమ్‌, మిచెల్ శాంట్నర్‌, మాట్ హెన్రీ/ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్‌, లుకీ ఫెర్గూసన్‌ ఉండనున్నారు.

For Interesting Sports news

TAGS : ICC World Cup 2019  Live, Who Will Win Semis in World Cup 2019?, India Enters Finals? Ind vs Kiwis Semis, #indiateam, #viratkohli, #rohitbatting, #klrahul, #viratbatting, #indiascorelive, #indvskiwissemis

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *