తొలి టీ20లో భారత్ దే గెలుపు

Spread the love

INDIA WON IN 1ST T20

వెస్టిండీస్ తో జరిగిన తొలి టీ20లో టీమిండియా బోణీ కొట్టింది. అద్భుతమైన బౌలింగ్ తో కరేబియన్ జట్టును కట్టిపడేసినా, బ్యాటింగ్ లో మాత్రం ఆపసోపాలు పడి ఎట్టకేలకు గెలుపొందింది. భారత బౌలర్లు విజృంభించడంతో విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం భారత జట్టు కూడా విండీస్ బౌలర్లను ఎదుర్కోవడానికి కష్టపడింది. చివరకు 6 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసి విజయం సాధించింది. టాస్ గెలిచిన భారత జట్టు విండీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఆరంభం నుంచే భారత బౌలర్లు చెలరేగడంతో విండీస్ బ్యాట్స్ మెన్ విలవిలలాడారు. నవదీప్ సైనీ లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు సంధించడంతో విండీస్ ఆరు ఓవర్లకే ఐదు వికెట్లు కోల్పోయింది. పొలార్డ్‌ (49; 49 బంతుల్లో 2×4, 4×6) మినహా ఎవరూ సరిగా ఆడలేకపోయారు. సైనీ మూడు వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్ రెండు వికెట్లు తీశాడు. సుందర్‌, ఖలీల్‌ అహ్మద్‌, కృనాల్‌ పాండ్య, రవీంద్ర జడేజాకు తలో వికెట్‌ దక్కింది.

అనంతరం 96 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్కోర్ బోర్డు 4 పరుగుల వద్ద ఉన్నప్పుడు ధావన్ (1) పెవిలియన్ చేరాడు. అనంతరం రోహిత్ శర్మ(24)తో కలిసి కోహ్లీ (19) స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ దశలో 32 పరుగుల వద్ద రోహిత్ ఔట్ కాగా.. తదుపరి బంతికే రిషబ్ పంత్ డకౌట్ అయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్ కు దిగిన మనీష్ పాండ్యా (19), కృనాల్ పాండ్యా (12), రవీంద్ర జడేజా (10 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (8 నాటౌట్) కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో భారత జట్టు మరో 16 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *