మూడో మ్యాచ్ లోనూ భారత్ జయభేరి

Spread the love

INDIA WON IN 3RD T20

వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లోనూ భారత జట్టు విజయం సాధించింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లలో ఓటమి చవిచూసి సిరీస్ పోగొట్టుకున్న కరేబియన్ జట్టు.. చివరి టీ20లోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది. గయానాలో మంగళవారం జరిగిన చివరి టీ20లో ఆతిథ్య జట్టుపై టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. రిషబ్‌ పంత్‌ (65నాటౌట్‌), విరాట్‌ కోహ్లీ(45 బంతుల్లో 52) రాణించడంతో వెస్టిండీస్‌ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 19.1 ఓవర్లలో ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత విండీస్ బ్యాటింగ్ కు దిగింది. అయితే, 14 పరుగులకే మూడు వికెట్టు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును పొలార్డ్ (45 బంతుల్లో 58), పావెల్ (20 బంతుల్లో 32) ఆదుకున్నారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మరోసారి ధావన్ (3) నిరాశపరిచాడు. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(18 బంతుల్లో 20) కాసేపు మెరిపించినా 5వ ఓవర్లో పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్‌తో కలిసి సారథి కోహ్లీ నిదానంగా ఇన్నింగ్స్‌ నిలబెట్టాడు. ఈ క్రమంలో 16వ ఓవర్‌లో కోహ్లీ అర్ధశతకం అందుకోగా, తర్వాతి ఓవర్‌లోనే పంత్‌ కూడా 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కానీ థామస్‌ వేసిన మరుసటి ఓవర్‌లోనే షాట్‌ ఆడే ప్రయత్నంలో కోహ్లీ(59) లూయిస్‌ చేతికి చిక్కాడు. చివరి ఓవర్‌లో బ్రాత్‌వైట్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది పంత్‌ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *