26 శాతానికి పెరిగిన నిరుద్యోగం

Indian Unemployment Increased 26%

కరోనా వైరస్‌ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనబడుతున్నది. కోవిడ్‌-19 వల్ల దేశీయ ఆర్థిక ప్రగతి కుప్పకూలింది. మార్చి 22 నుంచి విధించిన లాక్‌ డౌన్‌ వల్ల ప్రగతి చక్రాలకు కళ్లెం పడింది. అయితే, కరోనా రాక ముందూ మన ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా ఏం లేదు. ముఖ్యంగా, 2020 జనవరి నుంచి మార్చి 31 త్రైమాసికంపై కరోనా ప్రభావం భారత ఆర్థికంపై స్పష్టంగా కనిపించింది. లాక్‌డౌన్‌ వల్ల దేశంలో నిరుద్యోగం దాదాపు 26 శాతానికి చేరింది. రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోవడం వల్ల ఇంధన వినియోగం 66 శాతం మందగించింది. దేశమంతటా లాక్‌డౌన్‌ విధించడం వల్ల రాష్ట్రాలకు వచ్చే ఆదాయం దారుణంగా పడిపోయింది. ఈ క్రమంలో రాష్ట్రాలన్నీ కేంద్రం వైపు దృష్టి సారించాయి. అయితే, అనుకున్నంత సాయం రాష్ట్రాలకు అందలేదు. అయినప్పటికీ, గతేడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ ఏడాది అధికంగా కేంద్రం నుంచి రాష్ట్రాలు నిధుల్ని తీసుకున్నాయని ఆర్‌బీఐ వెల్లడించింది. 2019 ఏప్రిల్‌లో రాష్ట్రాలు సుమారు రూ.34,472 కోట్లను తీసుకుంటే, ఈ ఏడాది సుమారు రూ.55,225 కోట్లను తీసుకున్నాయి. దీనిని బట్టి సుమారు అరవై శాతం అధికంగా కేంద్రం నుంచి రాష్ట్రాలు సొమ్ము తీసుకున్నాయని చెప్పొచ్చు.

* యూరప్‌, ఆస్ట్రేలియా, అమెరికా, ఆసియా వంటి దేశాలపై 2020 జనవరి నుంచి కరోనా ప్రభావం కనబడింది. దీంతో, ఆయా దేశాలకు చెందిన సంస్థలు, పెట్టుబడిదారులు భారత్‌లో పెట్టుబడులు పెట్టడాన్ని నిలిపివేశాయి. ఫలితంగా, కొత్త పెట్టుబడులు దారుణంగా మందగించాయి. 2018- 2019 వార్షిక సంవత్సరంలో 13.1 లక్షల కోట్ల పెట్టుబడుల్ని భారతదేశం ఆకర్షించగా.. అదే 2019-2020లో కేవలం రూ.11.9 లక్షల కోట్లను ఆకర్షించింది. సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకూ పెట్టుబడులు ఆశించిన స్థాయిలో ఉన్నప్పటికీ, జనవరి నుంచి మార్చి త్రైమాసికం దారుణంగా దెబ్బపడింది. అప్పటికే కరోనా వైరస్‌ ప్రభావం అమెరికా, యూరప్‌ వంటి దేశాల్లో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని బడుగు, బలహీన వర్గాల ఖాతాలకు నేరుగా బదిలీ చేసే సొమ్ము కూడా 23 శాతం దాకా తగ్గుముఖం పట్టింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.3.3 లక్షల కోట్లను బదిలీ చేయగా.. 2019-20లో బదిలీ చేసిన సొమ్ము కేవలం రూ.2.53 లక్షల కోట్లే. నరేగా, ప్రధానమంత్రి ఆవాస్‌ గ్రామీణ్‌ యోజన వంటి పనులు జరగకపోవడమో కారణమని చెప్పొచ్చు.

బంగారం దిగుమతులు తగ్గాయ్..
స్టాక్‌ మార్కెట్‌ పతనం అవుతుండటంతో ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలపై దృష్టి సారించేవారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో, బంగారానికి ఎక్కడ్లేని గిరాకీ పెరిగింది. అయినప్పటికీ, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతి దారుణంగా తగ్గుముఖం పట్టింది. 2013 తర్వాత ఇదే అత్యల్పమని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. 2013లో సుమారు 890.3 టన్నుల బంగారాన్ని మనం దిగుమతి చేసుకోగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేవలం 559.6 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం. ఈ మొత్తాన్ని డాలర్లలో లెక్కిస్తే.. 2013లో 53,830 మిలియన్‌ డాలర్ల విలువ గల బంగారం దిగుమతి చేసుకుంటే, 2019-20 సంవత్సరంలో కేవలం 27,000 మిలియన్‌ డాలర్ల బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం.

 

Indian Economy Post Covid-19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *