ముంబయ్యే సూపర్ కింగ్స్

IPL WINNER IS MUMBAI INDIANS

  • ఐపీఎల్ ట్రోఫీని ఎగరేసుకుపోయిన ముంబై ఇండియన్స్
  • ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఒక్క పరుగు తేడాతో విజయం
  • చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్
  • నాలుగోసారి ఐపీఎల్ గెలిచి రికార్డు సృష్టించిన ముంబై

పేలవంగా సాగుతుందనుకున్న మ్యాచ్.. ఒక్కసారిగా మారిపోయింది. విజయం ఇరుజట్లతోనూ దోబూచులాడింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది. ఆదివారం హైదరాబాద్ లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ మైదానంలో ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్ పై ముంబై చిరస్మరణీయ విజయం సొంతం చేసుకుంది. తద్వారా నాలుగోసారి ఐపీఎల్ విజేతగా నిలిచి ఎక్కువ సార్లు ట్రోఫీ సొంతం చేసుకున్న జట్టుగా రికార్డు సృష్టించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకి ఓపెనర్లు చక్కని ఆరంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ (15), డీకాక్ (29) ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. చెన్నై బౌలర్లపై ఎదురుదాడి చేశారు. అయితే, రోహిత్ శర్మ ఔట్ కావడం.. కొద్దిసేపటికే డీకాక్ కూడా పెవిలియన్ చేరడంతో ముంబై ఇన్నింగ్స్ కుదపునకు లోనైంది. తర్వాత వచ్చిన సూర్యకుమార్ (15), కృనాల్ (7) కూడా వెంటవెంటనే ఔట్ కావడంతో 89 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఇషాన్ కిషన్ (23) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అతడు ఔట్ అయిన తర్వాత పోలార్డ్, హార్థిక్ లు ఆ బాధ్యత తీసుకున్నారు. అయితే, హార్థిక్(16) ను చాహర్ ఔట్ చేయడంతో ముంబై భారీ స్కోర్ చేయలేకపోయింది. పొలార్డ్ మాత్రం (25 బంతుల్లో 41) మెరుపులు మెరిపించడంతో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది.

అనంతరం 150 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ డుప్లెసిన్ (23), షేన్ వాట్సన్ (80) రాణించినా.. ధోనీ(2), రైనా(8), రాయుడు(1) విఫలం కావడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. 150 పరుగులు స్వల్ప లక్ష్యమే కావడంతో చెన్నైదే గెలుపు అని అంతా భావించారు. అయితే, ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విజయం వారి సొంతమైంది. 15.4 ఓవర్లలో వంద పరుగులు చేసిన చెన్నై.. 26 బంతుల్లో 50 పరుగులు చేయాల్సిన తరుణంలో విజయావకాశాలు ఇరు జట్లకు సమానంగా ఉన్నాయి. 18 బంతుల్లో 38 పరుగులు చేయాల్సిన సమయంలో మలింగ వేసిన 17వ ఓవర్లలో షేన్ వాట్సన్ వరుసగా మూడు సిక్సర్లతో ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు. దీంతో సమీకరణంగా 12 బంతుల్లో 18 పరుగులుగా మారింది. ఇక చెన్నై విజయం ఖాయమే అనుకున్నారు. అయితే, 19వ ఓవర్ వేసిన బుమ్రా.. బ్రేవో(15)ని ఔట్ చేయడంతోపాటు ఆ ఓవర్లో 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో చివరి ఓవర్లో చెన్నై విజయానికి 9 పరుగులు కావాల్సి వచ్చింది. చివరి ఓవర్ వేయడానికి వచ్చిన మలింగ.. తొలి మూడు బంతుల్లో 4 పరుగులు ఇచ్చాడు. 3 బంతుల్లో 5 పరుగులు చేయాల్సి ఉండగా.. ఫామ్ లో ఉన్న వాట్సన్ అనవసరంగా రెండో రన్ కి ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. దీంతో 2 బంతుల్లో 4 పరుగులు అవసరం కాగా, బ్యాటింగ్ వచ్చిన శార్దూల్ 5వ బంతికి రెండు పరుగులు తీశాడు. ఇక చివరి బంతికి రెండు పరుగులు కావాల్సి ఉండగా.. అందరిలో ఉత్కంఠ. చెన్నై రెండు పరుగులు చేసి గెలుస్తుందా? లేక ఒక్క పరుగు చేసి సూపర్ ఓవర్ కు వెళుతుందా అని అందరిలో ఉత్కంఠ. అయితే, సీనియర్ బౌలర్ అయిన మలింగ.. అద్భుతమైన యార్కర్ ద్వారా శార్దూల్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో గెలుపు ముంబై వశమైంది. టోర్నీలో 662 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ కు ఆరెంజ్ క్యాప్, 26 వికెట్లు తీసిన ఇమ్రాన్ తాహిర్ కు పర్పుల్ క్యాప్ దక్కాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఫెయిర్ ప్లే అవార్డు లభించింది.

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *