ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?

Spread the love

IS EXIT POLLS REAL?

  • అవి నిజమైన సందర్భాలు తక్కువే
  • వాటి ఆధారంగా బెట్టింగులు కట్టొద్దని సూచన

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ గద్దెనెక్కుతుందని, ఏపీలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని, తెలంగాణలో కారు జోరు ఖాయమని అవి తమ అంచనాలు వెలువరించాయి. వీటితో ఆయా పార్టీలు, శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తగా.. సానుకూల ఫలితాలు పొందలేని పార్టీలు మాత్రం వీటిని తేలిగ్గా తీసుకుంటున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఒక మాయ అని, అవి నిజమైన సందర్భాలు చాలా తక్కువని పేర్కొంటున్నాయి. ఎగ్జిట్ ఫలితాలతో కాదు.. ఎగ్జాక్ట్ ఫలితాలతో సంబరాలు చేసుకుంటామని ఆయా పార్టీల నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతకీ ఎగ్జిట్ పోల్స్ కచ్చితమైన ఫలితాల్నే వెల్లడిస్తాయా? వాటిని ఎంతవరకు నమ్మొచ్చు? అవి వెలువరించిన ఫలితాలు వాస్తవానికి ఎంత మేరకు దగ్గరగా ఉంటాయనే అంశాలపై ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కచ్చితమైన ఫలితాల్ని వెలువరిస్తాయని అని అనుకోవడానికి వీల్లేదు. ఇప్పటివరకు చాలా సంస్థలు తమ తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. అన్నిసార్లూ కచ్చితమైన ఫలితాలు రాలేదు. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన తీరుపైనే వాటి విజయం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ప్రీపోల్ సర్వే, ఎగ్జిట్ పోల్ సర్వే, పోస్ట్ పోల్ సర్వే అని మూడు రకాల అధ్యయనాలు ఉంటాయి.

ఎన్నికలు జరగడానికి ముందుగా నిర్వహించేవి ప్రీపోల్ సర్వే అయితే, ఎన్నికలు ముగిశాక చేసేది పోస్ట్ పోల్ సర్వే. ఇక ఎగ్జిట్ పోల్ అంటే.. ఓటరు పోలింగ్ బూత్ లో ఓటేసి బయటకు వచ్చే సమయంలో అతడు ఏ పార్టీకి ఓటేశారనే విషయం అడిగి తెలుసుకుంటారు. నిర్దేశిత పోలింగ్ కేంద్రాల్లో ఇంత మొత్తం శాంపిల్ తీసుకుని వీటిని నిర్వహిస్తారు. వయసు, లింగ బేధం, కులం తదితర అంశాల ప్రాతిపదికగా ఈ సర్వే చేస్తారు. అనంతరం ఈ ఫలితాలన్నింటినీ శాస్త్రీయ పద్ధతిలో క్రోఢీకరించి, ఇతరత్రా అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ఫలితాలను వెలువరిస్తారు. అయితే, ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను విశ్లేషిస్తే మాత్రం అవి చాలా తక్కువ సందర్భాల్లోనే నిజమయ్యాయి. 2004 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చాలా సర్వేలు వెల్లడించాయి. కానీ యూపీఏ అధికారంలోకి వచ్చింది. 2009లో యూపీఏకి వచ్చే సీట్ల సంఖ్యను సరిగా అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయి. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ, ఆ కూటమికి వచ్చే సీట్లను కచ్చితంగా చెప్పలేకపోయాయి. అంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి ఒక అంచనాకు రావడం వీలువుతుంది కానీ, అవి వంద శాతం నిజమవుతాయనే మాత్రం అనుకోనవసరం లేదు. అందువల్ల ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆధారంగా చేసుకుని బెట్టింగులు కట్టడం అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

NATIONAL NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *