ఇదేం లాక్ డౌన్ నాయనా?

Is This True Lockdown?

ఇదేం లాక్ డౌనో అస్సలు అర్థం కావడం లేదు. ఇప్పటివరకూ ఇండ్లల్లో ఉన్నవారంతా షాక్ అవుతున్నారు. 45 రోజుల్నుంచి ఇంట్లో బంధించేసి కేవలం కరోనా వార్తలను చూపెట్టి చూపెట్టి భయపెట్టారు. ఏ ఛానెల్ మార్చినా అవే వార్తలు. అక్కడ అంత మంది చనిపోయారు. ఇక్కడ ఇంత మంది చనిపోయారని స్పెషల్ స్టోరీలు, డిబేట్లు, విశ్లేషణలు, బ్రేకింగ్ న్యూస్లు చూపెట్టి భయకంపితుల్ని చేశారు. మీకేం కాదు ఇప్పుడు బయటికి వెళ్లమని స్వయంగా మోడీ, కేసీఆర్ లు వచ్చి చెప్పినా  బయట స్వేచ్ఛగా తిరగాలంటే సుష్షు పోసుకునే పరిస్థితి. గత 45 రోజుల్నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తమతో ఆటాడుకున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. కనిపించని కరోనా నుంచి రక్షించుకునేందుకు తాము ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ కూర్చుంటే.. ఎంచక్కా మందు షాపులు తెరిచేశారు. నిన్నటివరకూ ప్రజలను రోడ్ల మీదకు రానివ్వని పోలీసులు ఇప్పుడా ప్రజలతో దగ్గరుండి బీరు, విస్కీలు కొనిపిస్తున్నారు. ఎంత విచిత్రమైన పరిస్థితి? పోలీసులకు ఇప్పుడింకా  చిర్రెత్తుకొస్తుంది. ఎందుకో తెలుసా?

మందు తాగిన వారిలో కొందరు ఇళ్లల్లో భార్యాపిల్లలతో గొడవ చేస్తే.. వారి ఫిర్యాదు మేరకు మళ్లీ అదే పోలీసులు.. అదే పోలీసు స్టేషన్కు పట్టుకొస్తున్నారు. ‘మీరే కదా సారు.. పొద్దున దగ్గరుండి మందు కొనిపించిండ్రు. ఇప్పుడేమో తిడుతున్నరు. మందు కొనిపియ్యకపోతే మేం ఇంట్ల మంచిగా ఉండేవాళ్లం’ అని మందు బాబులు అంటుంటే పోలీసులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇక, ఇప్పటివరకూ ఇండ్లల్లో కూర్చోపెట్టి, కరోనాకు సంబంధించిన భయంకరమైన వార్తలను చూసీ చూసీ అవి మెదడులో స్టోర్ అయిపోయాయి. ఇప్పుడు రైలు ఎక్కు.. ఆఫీసుకెళ్లు.. అంటే ఎలాగో చాలా మందికి అర్థం కావడం లేదు.

సోమవారం నుంచి రెడ్ జోన్లో ముప్పయ్ మూడు శాతం ప్రభుత్వ ఆఫీసులు తెరుచుకుంటయ్ అని అంటున్నరు. కాకపోతే, రాత్రి ఏడు నుంచి రేపొద్దున ఏడు దాకా కర్ఫ్యూ ఉంటదంట. ఆరు గంటల దాకా డ్యూటీ చేసినోళ్లు దూరముండే ఇళ్లలకు అంత తొందరగా చేరుకుంటారా? మరి, గిదేం నిర్ణయమో ప్రభుత్వాలకు తెలియాలె. ఇక, రేపట్నుంచి కొన్ని స్పెషల్ ట్రైన్లను నడిపిస్తున్నారంట. ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ మీదుగా కొన్ని స్పెషల్ ట్రైన్లు నడుస్తాయంట. కరోనా లేనివారికే అందులో ప్రయాణించే అవకాశం ఉంటుందట.  మరి, అందులోకి ఎక్కేవారికి కరోనా లేదని సర్టిఫికెట్ ఎవరిస్తారో రైల్వే విభాగానికే తెలియాలె. మనవాళ్లు ఎంత తెలివైన వాళ్లంటే విదేశాల్నుంచి వచ్చేవారు గంట ముందు ప్యారసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుని జ్వరం లేదని ఎయిర్ పోర్టు చెకింగ్ లో తప్పించుకునేవారు. ఇప్పుడు కొందరు అలా చేయరని గ్యారెంటీ ఏమిటి? ఒకవేళ సికింద్రాబాద్, కాజీపేట్, విజయవాడ వంటి స్టేషన్లలో దిగినా, వారు ఇంటి వరకూ ఎలా చేరుకుంటారు? బస్సులేమో లేవు. ట్యాక్సీలు, ఆటోలు బందు పెట్టిండ్రు. స్టేషన్లో దిగినవారు ఎవరికి వారే రిస్క్ తీసుకుని సొంత వాహనాల మీద వారిని ఇంటికి తెచ్చుకోవాల్సి ఉంటుందేమో. మొత్తానికి, కరోనా నుంచి ప్రజలను రక్షించాలన్న సోయి ప్రభుత్వాలకు పోయినట్లు ఉన్నది. అయినా, ప్రజల ప్రాణాల కంటే ఆర్థికమే ప్రభుత్వాలకు ముఖ్యమైందనుకుంటా. ఇలాగైతే, రానున్న రోజుల్లో భారతదేశం కరోనా విషయంలో ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుందని ప్రజలు అనుకుంటున్నారు.

#TeluguStatesInLockdown

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *