టాలీవుడ్ లో మళ్లీ గ్రూపులు మొదలవుతున్నాయా?

Is tollywood deviding?

నాయకత్వం అనేది అంత సులువైన విషయం కాదు. ఒక్కోసారి మంచి మనసుతోనే వెళ్లినా.. మనకు తెలియకుండానే విమర్శలు వస్తాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా ఇలాంటివే వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధాన గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి అనేది తాజాగా వినిపిస్తోన్న మాట. మామూలుగానే తెలుగు సినిమా పరిశ్రమ పుట్టిన దగ్గర్నుంచీ సామాజిక వర్గాల వారీగా గ్రూపులు ఉన్నాయి అనేది జగమెరిగిన సత్యం. ఈ వర్గాల్లో ఎవరికి వారు పరిశ్రమపై ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తారు. తొలినాళ్ల నుంచి కూడా ఇవే జరుగుతున్నాయి.  కొన్నాళ్ల క్రితం గ్రూపులకు ఆస్కారం లేకుండా దాసరి ఒంటి చేత్తో నడిపించే ప్రయత్నంలో మాగ్జిమం సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఆ తర్వాత కొంత స్తబ్ధత నెలకొన్నా.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి దాసరి పోస్ట్ ను భుజాలపై వేసుకున్నారు. ఆ మేరకు ఇండస్ట్రీలో చాలా పంచాయితీలు చిరంజీవి ఇంటికే చేరుతున్నాయి. అయితే దాసరి తర్వాత ఆ స్థానం కోసం మరో సామాజిక వర్గం నుంచి కూడా ప్రయత్నాలు చేశారట. కానీ ఆ వైపు పెద్ద స్టార్ లేకపోవడం.. వల్ల వారి ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. పైగా చిరంజీవిని కాదనేంత గట్స్ కూడా ఆ వైపు లేవుట. అందుకే దాసరి తర్వాత మళ్లీ చిరంజీవే ఆ స్థానంలో ఉండటం కొందరికి నచ్చడం లేదట. అందుకే ఆయన వెనకే ఉంటూనే తమదైన ఓ గ్రూప్ ఏర్పాటు చేసుకుంటున్నారని టాక్. ఇక మరింకొందరైతే ఏకంగా చిరంజీవి సమావేశాలకు వెళ్లడం లేదు. అది గమనించిన ఆ వర్గం నుంచి వీరికి పెద్దగా సమాచారం ఇవ్వడం లేదని చెప్పుకుంటున్నారు.

ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రైవల్రీ లేకపోయినా.. గ్రూపులు మొదలయ్యాయనే సంకేతం మాత్రం స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. చిరంజీవి చెబితే మేమెందుకు వినాలి.. మేమూ చెబుతాం అనే మధ్యే మార్గపు పెద్దలు కూడా కొందరు తయారయ్యారు అంటున్నారు. మరి ఆ వ్యక్తులు ఎవరు.. అనేది గత కొన్ని రోజులుగా చిరంజీవి నిర్వహిస్తోన్న సమావేశాలు చూస్తే తెలుస్తుందట. మరోవైపు చిరంజీవి అండ్ టీమ్ కూడా కావాలనే కొందరికి సమాచారం ఇవ్వడం లేదనీ.. అస్సలే మాత్రం ప్రాధాన్యత లేని కొందరు వ్యక్తులను కేవలం ‘తమ’వాళ్లు అనే కారణంతోనే అన్ని సమావేశాల్లో కనిపించేలా చేస్తున్నారట. ఈ కోణంలో చూస్తే చాలామంది సీనియర్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఆర్టిస్టులకు ఈ మెగా పంచాయితీల్లో అస్సలు ప్రాధాన్యతే లేదనేదీ తెలుస్తుంది. మొత్తంగా కెసీఆర్ తో కలిసినప్పుడు కూడా కేవలం మెగాస్టార్ మాత్రమే హైలెట్ అయ్యేలా చూడటంలో కూడా ఆయన పిఆర్ టీమ్ కీలకంగా వ్యవహరించిందనేవారూ ఉన్నారు. మొత్తంగా చిరంజీవి నాయకత్వం వర్థిల్లాలి అనే టీమ్ తో పాటు కాదు అనే మరో గ్రూప్ కూడా ఆల్రెడీ పరిశ్రమలో కనిపిస్తోందనేది తెలుస్తోంది. మరి ఆ టీమ్ ఎవరు.. నిజంగా మెగాస్టార్ కు వ్యతిరేకంగా నిలబడి ‘తమ’వాయిస్ ను బలంగా  వినిపిస్తారా అనేది కాలమే చెబుతుంది.

tollywood news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *