త్వరలో జగన్ బస్సు యాత్ర?

Spread the love

Jagan Bus Yatra

  • పండగ తర్వాత ప్రారంభించే యోచన
  • పాదయాత్రలో కవర్ కాని ప్రాంతాల్లో పర్యటన
  • ఇచ్చాపురంలో ముగిసిన పాదయాత్ర

వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారా? ఇప్పటికే పాదయాత్రను విజయవంతంగా పూర్తిచేసుకున్న ఆయన.. బస్సు యాత్ర చేయాలనుకుంటున్నారా? అంటే ఔననే అంటున్నారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో మొదలుపెట్టిన పాదయాత్ర బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. 341 రోజులపాటు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి రికార్డు సృష్టించిన జగన్.. బస్సు యాత్ర ద్వారా మళ్లీ జనంలనే ఉండాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. పాదయాత్ర ద్వారా కవర్ కాని ప్రాంతాల్లో బస్సు యాత్ర ద్వారా పర్యటించి, ఆయా ప్రాంతాల సమస్యలు తెలుసుకోవడంతోపాటు ప్రజలతో మమేకం కావాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలకు ఇంక ఎంతో సమయం లేనందున బస్సు యాత్ర ద్వారా మిగిలిన ప్రాంతాలను పర్యటించాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. పాదయాత్ర ముగించుకున్న జగన్.. గురువారం తిరుపతి చేరుకున్నారు. అలిపిరి నుంచి కాలినడకన కొండపైకి చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం సంక్రాంతి తర్వాత బస్సు యాత్ర చేపట్టే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో జరిగిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్ విరుచుకుపడ్డారు. అలాగే రైతులపై వరాల జల్లు కురిపించారు. తాము అధికారంలోకి వస్తే నవరత్నాల పథకాలు ప్రతి లబ్ధిదారుడి ఇంటికీ చేరేలా చూస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *