30 ఏళ్లుగా కుప్పంలో ఏమీ చేయలేదు

JAGAN FIRES ON BABU

  • చంద్రబాబుపై జగన్ ధ్వజం
  • పాలారు ప్రాజెక్టును కూడా అడ్డుకున్నారని మండిపాటు
  • సొంత తమ్ముడినే చూడని ఆయన రాష్ట్రానికి అన్నగా ఎలా ఉంటాడని ప్రశ్న

టీడీపీ అధినేత చంద్రబాబు 30 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, ఇక్కడ అభివృద్ధి ఏమీ జరగలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ శుక్రవారం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాబుపై నిప్పులు చెరిగారు. అక్షరాస్యతలో సైతం కుప్పం వెనబడి ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం ప్రాథమిక విద్య కూడా సరిగా అందని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని విమర్శించారు. ఇక్కడి పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి చంద్రబాబు ముందుకు రాలేదని దుయ్యబట్టారు. వైఎస్ హయాంలో శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు పూర్తయితే, తనకు పేరు ఏమీ ఉండదని భావించి తమిళనాడు ప్రభుత్వంతో చేతులు కలిపి ప్రాజెక్టును అడ్డుకున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలను ఈ సర్కారు అటకెక్కించిందని మండిపడ్డారు.

ఇక్కడి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ రాకపోవడంతో కూలి పనుల కోసం బెంగళూరుకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే ఆరోగ్య శ్రీ కార్డు కూడా ఇప్పుడు ఎందుకూ పనికిరాకుండా పోయిందని పేర్కొన్నారు. 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. కనీసం తన సొంత నియోజకవర్గంలో కూడా దానిని అమలుచేయడంలేదని జగన్ తూర్పారబట్టారు. సొంత తమ్ముడినే చిన్నచూపు చూసిన చంద్రబాబు.. రాష్ట్రప్రజలకు పెద్దన్నలా ఎలా ఉంటారని ప్రశ్నించారు. సొంత తమ్ముడికి, చెల్లెల్లకు, పిల్లినిచ్చిన మామకే వెన్నుపొడిచిన వ్యక్తి రాష్ట్రప్రజలకు పెద్దకొడుకు ఎలా అవుతాడన్నారు? సొంత కుటుంబ సభ్యులనే దారుణంగా మోసం చేసిన చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని ప్రజలను కోరారు. హరికృష్ణ భౌతికకాయం సాక్షిగా రాజకీయాలు చేశారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, నవరత్నాలతో అందరి జీవితాల్లోనూ కొత్త వెలుగులు నింపుతామని జగన్ భరోసా ఇచ్చారు. కాగా, ఏపీని అగ్రపథాన నిలపడమే తన లక్ష్యమని జగన్ ట్వీట్ చేశారు. ‘‘పారదర్శకమైన పాలనతో నూతన సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ, అవినీతిలేని, వికేంద్రీకరణతో కూడి ప్రభుత్వంతో, మీ ఇంటివద్దే పాలన అందేలా, స్థిరమైన అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ ను అగ్రభాగంలో నిలపడమే ఏపీకి సంబంధించి నా విజన్’’ అని అందులో పేర్కొన్నారు.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *