90 శాతం వాగ్ధానాల అమలు

Jagan Fulfilled 90% Promises

ఏడాది కాలంలోనే 90 శాతం వాగ్ధానాల అమలు దిశలో అడుగులు వేశామని, మేనిఫెస్టోలో మొత్తం హామీలు 129 అయితే, వాటిలో ఇప్పటికే 77 అమలు చేయగా, డేట్లు ఇచ్చి సిద్ధంగా ఉన్నవి మరో 36 అని, ఆ విధంగా 90 శాతం వాగ్దానాలు దాదాపు అమలు చేశామని సీఎం వైయస్‌ జగన్‌ వెల్లడించారు.  ఇంకా మిగిలినవి 16 హామీలు మాత్రమే అన్న ఆయన, అవి కూడా అమలుకు పరుగులు పెట్టిస్తామని తెలిపారు. మేనిఫెస్టోలో లేకపోయినా ప్రజల అవసరాల కోసం చేసినవి మరో 40 ఉన్నాయని చెప్పారు.  వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ఏర్పాటు చేస్తున్న రైతు భరోసా కేంద్రాలను శనివారం ప్రారంభించిన సీఎం, ఏడాది పాలన పూర్తి చేసిన తాను, ఇది తొలి ఏడాది నేను పెడుతున్న సంతకం అని అభివర్ణించారు. రాబోయే రోజుల్లో గ్రామ వలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి  మేనిఫెస్టో, బుక్‌ పంపిస్తామని, తాము ఆయా పనులు చేశామా? లేదా? అన్నది మీరే లెక్క చూసుకోవాలని కోరారు.

అవ్వాతాతల మీద గుండెల మీద ప్రేమతో.. అక్కా చెల్లెమ్మల మీద మమకారంతో.. రైతుల పట్ల బాధ్యతతో.. అట్టడుగు వర్గాల పట్ల అభిమానంతో.. మీ పిల్లల భవిష్యత్తు పట్ల దూరదృష్టితో.. మీ అందరి ఆరోగ్యం పట్ల శ్రద్ధతో.. మీరు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి, ఈ 6 కోట్ల ఆంధ్రప్రదేశ్‌ సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకున్నానని వైయస్‌ జగన్‌ అను నేను.. ఏడాది కాలంగా మీ కుటుంబ సభ్యుడిగా, మీ ముఖ్యమంత్రిగా నేను చేసిన ప్రమాణాన్ని, ఇచ్చిన మాటను తూచ తప్పకుండా అమలు చేస్తున్నాను అని, దైవసాక్షిగా, ప్రజల సాక్షిగా మరోసారి స్పష్టం చేస్తున్నాను అని పేర్కొన్నారు.
ఈ ఏడాదిలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు 3,58 కోట్ల మంది కాగా, రూ.40,627 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని సీఎం చెప్పారు. పెన్షన్‌ కోసం నెలకు రూ.1500 కోట్లు ఖర్చు చేస్తున్నామని, గత ప్రభుత్వం వదిలి పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.686 కోట్లు చెల్లించడంతో పాటు, ఆరోగ్య ఆసరా అని కొత్త పథకం ప్రారంభించామని చెప్పారు. ఇంకా విద్యాదీవెన, వసతి దీవెన. పిల్లల చదువులకు భరోసా. కంటి వెలుగు. నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, లా నేస్తం, గోరుముద్ద, అక్కా చెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు అమలు చేస్తున్నామన్న ఆయన, గత పాలనకు, ఈ పాలనకు మధ్య తేడా చూడాలని కోరారు. గతంలో మేనిఫెస్టోలో 650కి పైగా వాగ్దానాలు. పేజీల కొద్దీ ఆ మేనిఫెస్టో ఇచ్చారని, కానీ 10 శాతం కూడా అమలు చేయలేదని చెప్పారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీల మాఫియా ముఠాలుగా మారి, ప్రతి పనికి లంచం తీసుకున్నాయన్న సీఎం, ఇప్పుడు ఇంటి గడప వద్దకే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని, పూర్తి పారదర్శకతతో అవి అమల వుతున్నాయని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందున్నాయని చెప్పారు. రైతులకు విత్తనాల సరఫరా మొదలు వారి పంటలు అమ్ముకునే వరకు తోడుగా నిల్చే రైతు భరోసా కేంద్రాలను సీఎం వైయస్‌ జగన్‌ శనివారం క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభించారు. కంప్యూటర్‌లో బటన్‌నొక్కి ఒకేసారి 10641 రైతు భరోసా కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కాగా, ఇదే రోజు ఆయన ఏడాది పాలన పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఆయన ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు.

ఎంతో సంతోషంగా ఉంది:
ఈరోజుకు తమ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిందని, ఇవాళ రైతులతో గడపడం, వారికి కేటాయించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాదిలో రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పానన్న ఆయన, దాదాపు 62 శాతం వ్యవసాయంపై ఆధారపడ్డారని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతులు, రైతు కూలీలు వీరిద్దరూ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం తమదని చెప్పారు. అందుకే తొలి ఏడాదిలోనే రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకం తీసుకువచ్చామని, దాదాపు రూ.10,200 కోట్లు, సుమారు 49 లక్షల రైతు కుటుంబాల ఖాతాల్లో వేశామని తెలిపారు. పెట్టుబడి ఖర్చు తగ్గాలని, ఆ తర్వాత రైతుకు ఏదైనా విపత్తు వస్తే ఆదుకోవాలని, ఇంకా పంటలకు గిట్టుబాటు ధర రావాలన్న ముఖ్యమంత్రి ఆ దిశలోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వాటి ద్వారా విత్తనం మొదలు పంట అమ్మకం వరకు గ్రామాల్లో రైతులకు అడుగడుగునా తోడుగా ఉంటామని తెలిపారు.

చిత్తశుద్ధి–నిజాయితీ:
ఈ ఏడాది పాలన చిత్తశుద్జి, నిజాయితీ, నిబద్ధతో జరిగిందని నిజాయితీగా చెబుతానని సీఎం అన్నారు. ‘నా రాజకీయ జీవితం 11 ఏళ్లు. 2009లో ఎంపీగా ఎన్నికయ్యాను. కోట్ల మందిని కలిసి ఉంటాను. రాష్ట్రం నలుమూలల ప్రతి ప్రాంత సమస్యలను తెలుసుకునేందుకు అడుగులు వేశాను. 3648 కి.మీ పాదయాత్రలో ప్రతి జిల్లాలో తిరిగాను. నా రాజకీయ జీవితంలో దాదాపు ప్రతి గ్రామాన్ని సందర్శించి ఉంటాను. చదువురాని వారు కలిసినప్పుడు, వారు ఎందుకు చదవలేదన్నది నా మనసును కలిచి వేసేది. చదివించాలన్న ఆసక్తి లేక కాదు. చదివించే స్థోమత లేదని తెలిసి బాధ పడ్డాను. వైద్యం కోసం అప్పుల పాలు కావడం చూశాను. క్యాన్సర్‌ వస్తే అరకొర చికిత్స అందించడం చూశాను.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణస్జితిని, రైతుల సమస్యలను చూశాను. కనీస ధర లేక పంటలు పొలాల్లో విడిచిపెడుతున్న వారిని చూశాను’. ‘11 ఏళ్ల రాజకీయ జీవితంలో అక్కా చెల్లెమ్మలను, వారి బాధలు, సమస్యలు చూశాను. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను చూశాను. వారి కన్నీరు తుడవడం, వారి జీవితాలు మార్చాలన్న ఆలోచనతో చర్యలు.
పేదరికం నుంచి కుటుంబాలు బయట పడాలి. వారు అప్పులపాలు కావొద్దు అని భావించాను’ అని ముఖ్యమంత్రి వివరించారు.

Cm Jagan Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *