లోక్ సభ అభ్యర్థులపై జగన్ కసరత్తు

JAGAN SELECTING LS CANDIDATES

  • ఇప్పటికి 9 స్థానాల్లోనే స్పష్టత
  • 16 సీట్లపై కొనసాగుతున్నసందిగ్ధత
  • నామినేషన్ల దాఖలుకు ఇక రెండు వారాలే గడువు

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడటం.. మొదటి విడతలోనే తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఉండటం.. తొలి నోటిఫికేషన్ కు సమయం దగ్గర పడుతుంటంతో రాజకీయాల్లో ఊపు అందుకుంది. ఏ స్థానం నుంచి ఏ అభ్యర్థిని రంగంలోకి దింపాలనే అంశంపై ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అసెంబ్లీ విషయానికొచ్చేసరికి పెద్దగా సమస్యలు లేకున్నా.. లోక్ సభ స్థానాల విషయంలో పలు పార్టీల్లో సందిగ్ధత కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే కరువైన పరిస్థితి ఉండగా.. వైఎస్సార్ సీపీ పలు స్థానాల్లో ఎవరిని ఖరారో చేయాలో తెలియక ఇంకా కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 25 స్థానాలు ఉండగా.. ఇప్పటివరకు పది స్థానాల్లో కూడా వైఎస్సార్ సీపీ ఓ నిర్ణయానికి రాలేకపోయింది. ప్రస్తుతానికి కేవలం 9 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ఖరారు చేసింది. వీరిలో వైఎస్ అవినాష్ రెడ్డి (కడప), పి.మిథున్ రెడ్డి (రాజంపేట), గోరంట్ల మాధవ్ (హిందూపురం), ఎంవీవీ సత్యనారాయణ (విశాఖపట్నం), మార్గాని భరత్ (రాజమహేంద్రవరం), అశోక్ (కాకినాడ), బాలశౌరి (మచిలీపట్నం), చింతా అనురాధ (అమలాపురం), మేకపాటి రాజమోహన్ రెడ్డి (నెల్లూరు) ఉన్నారు.

ఇక కర్నూలు నుంచి జగన్ సోదరి షర్మిలను బరిలోకి దింపే అవకాశం ఉందని సమాచారం. ఇక్కడ టీడీపీ నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఉన్నందును ఆయన్ను ఢీకొట్టేందుకు షర్మిల అయితే బావుంటుందని అధిష్టానం యోచిస్తున్నట్టు తెలిసింది. ఇక అనంతపురం నుంచి టీడీపీ తరఫున జేసీ కుటుంబం బరిలోకి ఉంటుందని తెలియడంతో, వారిని నిలువరించేందుకు అనంత వెంకట రామిరెడ్డిని తెరపైకి తేవాలని యోచిస్తున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. నంద్యాలలో శిల్పా కుటుంబం ఆశించగా.. వారి కుటుంబం నుంచే మూడు టికెట్లు సాధ్యపడదని తేల్చి చెప్పిన జగన్.. వ్యాపారవేత్త పోచ బ్రహ్మానందరెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. తిరుపతి నుంచి మధుసూదనరావును దింపే అవకాశం ఉంది. విజయవాడలో పారిశ్రామికవేత్త, ఇటీవల టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరిన దాసరి జైరమేష్‌ పేరును పరిశీలిస్తున్నారు. రఘురామకృష్ణంరాజు పార్టీలోకి తిరిగి రావడంతో ఆయనకు నరసాపురం స్థానాన్ని దాదాపు ఖరారు చేశారు. విజయనగరంలో బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచే ఒకరికి అవకాశం ఉందంటున్నారు. శ్రీకాకుళంలో దువ్వాడ శ్రీనివాస్‌, కిల్లి కృపారాణి మధ్య పోటీ నెలకొంది. గుంటూరులో మోదుగుల వేణుగోపాలరెడ్డి పేరును పరిశీలిస్తున్నారు. అరకు, బాపట్ల, చిత్తూరు, కర్నూలు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులవిషయం కొలిక్కిరాలేదు. నామినేషన్ల దాఖలుకు ఇక రెండు వారాల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా పార్టీ అభ్యర్థులను ఖరారు చేయాలని జగన్ యోచిస్తున్నారు.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *