Jersey Movie Reviews

Jersey Movie Review
మూవీ:  జెర్సీ
ఆర్టిస్టులు:  నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, స‌త్య‌రాజ్‌, ప్ర‌వీణ్‌, రావు ర‌మేష్‌, సంప‌త్ రాజ్, సంజ‌య్ స్వ‌రూప్ త‌దిత‌రులు
డైర‌క్ష‌న్‌:  గౌత‌మ్ తిన్న‌నూరి
బ్యాన‌ర్‌:  సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
ప్రొడ్యూస‌ర్‌:  సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ
ఎడిటింగ్‌:  న‌వీన్ నూలి
కెమెరా:  సాను వ‌ర్గీస్‌
రిలీజ్ డేట్‌: 19.04.2019
ఈ ఏడాది స‌మ్మ‌ర్‌కి విడుద‌లైన చిత్రాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు అంతో ఇంతో పేరు తెచ్చుకుని రూ.50కోట్ల క్ల‌బ్‌లో చేరిన సినిమా `మ‌జిలీ`. ప్రీ రిలీజ్ బిజినెస్ తో కాస్త పాజిటివ్ టాక్‌తో ఆడుతున్న సినిమా `చిత్ర ల‌హ‌రి`. తాజాగా ఈ శుక్ర‌వారం `జెర్సీ`, కాంచ‌న‌3 సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. వాటిలో `మ‌జిలీ`కి, `జెర్సీ`కి మంచి పోలిక‌లున్నాయి. రెండూ క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో జ‌రుగుతాయి. రెండింటిలోనూ పెళ్లికి ముందు రొమాన్స్, పెళ్ల‌య్యాక బాధ్య‌త‌లు ఉంటాయి. తొలిస‌గంలో రెండు సినిమాల్లోనూ ల‌వ్ ఎపిసోడ్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్‌లో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య సాగే స‌న్నివేశాలుంటాయి. మ‌రి `మ‌జిలీ`కి `జెర్సీ`కి ఉన్న తేడాలేంటి? `జెర్సీ`లో వెండితెర‌మీద క్రికెట్‌ను ప్రేక్ష‌కులు ఆస్వాదిస్తారా… లెట్స్ హ్యావ్ ఎ లుక్‌…
క‌థ‌:
అర్జున్ (నాని), సారా (శ్ర‌ద్ధా శ్రీనాథ్‌) ప్రేమ‌లో ప‌డ‌తారు. అర్జున్ క్రికెట‌ర్‌. సారా ఓ త్రీ స్టార్ హోట‌ల్‌లో ఉద్యోగం చేస్తుంటుంది. వాళ్ల పెళ్లికి సారా త‌ల్లిదండ్రులు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో అసిస్టెంట్ కోచ్ మూర్తి (స‌త్య‌రాజ్‌) ఆధ్వర్యంలో రిజిస్ట‌ర్ మేరేజ్ చేసుకుంటారు. కొత్త‌గా కాపురం పెడ‌తాడు. రంజీ ట్రోఫీలో బాగా ఆడిన అర్జున్ పేరు ఇండియ‌న్ టీమ్‌కి వెళ్లే లిస్ట్ లో ఉండ‌దు. అందువల్ల అత‌ను ఫుడ్ కార్పొరేష‌న్‌లో ఉద్యోగంలో చేరుతాడు. కానీ లంచం ఇచ్చి ఆ ఉద్యోగంలో  చేరార‌నే నెపంతో ప్ర‌భుత్వం ఓ 15 మందిని స‌స్పెన్ష‌న్ చేస్తుంది. ఆ లిస్టులో అర్జున్ పేరు కూడా ఉండ‌టంతో అత‌నికి ఉద్యోగం ఉండ‌దు. కేసులో గెల‌వాలంటే లాయ‌ర్ (రావు ర‌మేష్‌) లంచం అడుగుతాడు. రూ.50వేలు ఇచ్చుకునే స్తోమ‌త లేక సైలెంట్‌గా ఉంటాడు అర్జున్‌. ఆ స‌మ‌యంలోనే అత‌ని కుమారుడికి పుట్టిన‌రోజు వ‌స్తుంది. కొడుకు జెర్సీ కొనివ్వ‌మ‌ని కోరుతాడు. చేతిలో డ‌బ్బులు ఉండ‌ని ఆ తండ్రి ఏం చేశాడు?  కొడుకు కోరిన కోరిక అత‌న్ని ఎటువైపు మ‌ళ్లించింది? అత‌నికి భార్య మ‌ద్ద‌తు దొరికిందా?  లేదా?  రోప్‌లోప‌ల అత‌ని బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించ‌గ‌లిగాడా లేదా అనేది ఆసక్తిక‌రం.
ప్ల‌స్ పాయింట్లు
– న‌టీన‌టుల ప‌నితీరు
– రీరికార్డింగ్‌
– కొన్ని డైలాగులు
– అట్మాస్పియ‌ర్‌
– కెమెరా
మైన‌స్ పాయింట్లు
– స్లో నెరేష‌న్‌
– అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాలు
– కొన్ని కృత‌క‌మైన డైలాగులు (న‌న్ను, ఇంకా నానినీ… వంటివి)
విశ్లేష‌ణ‌
ఒక‌మ్మాయి పెద్ద‌వారిని కూడా కాద‌ని, న‌చ్చిన వాడిని పెళ్లి చేసుకుని కోటి క‌ల‌ల‌తో కాపురంలో అడుగుపెడుతుంది. అత‌నితో జీవితం కొత్త‌ల్లో బాగానే ఉంటుంది. కానీ, కొన్నాళ్ల‌కు అత‌నికి ఉద్యోగం పోతుంది. ఆ త‌ర్వాత  ఇంకో ఉద్యోగాన్ని వెతుక్కోడు. జీవితం ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తాడు. ఆమె సంపాద‌న మీద ఆధార‌ప‌డ‌తాడు. ఆఖ‌రికి కొడుకు కోరిన కోర్కెను తీర్చ‌డానికి కూడా ఆమె మీద‌నే ఆధార‌ప‌డ‌తాడు. అలాగ‌ని అత‌ను అస‌మ‌ర్థుడు కాదు. రంజీ ట్రోఫీకి ఆడిన‌వాడు. అత‌ని క్రెడిట్‌లో గొప్ప ట్రాక్ రికార్డ్ ఉంటుంది. కానీ జాతీయ జ‌ట్టుకు త‌న‌ను ఎంపిక చేయ‌లేద‌నే బాధ కూడా ఉంటుంది. ఆ బాధ‌తోనే అత‌ను క్రికెట్‌కి దూర‌మ‌వుతాడ‌ని ప్రేక్ష‌కులు అనుకుంటారు. కానీ అంత‌కు మించిన విషయం మ‌రొక‌టి ఉంటుంది. దానికి కార‌ణాన్ని క్లైమాక్స్ లో ట్విస్టు రూపంలో చెప్పాడు ద‌ర్శ‌కుడు. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ఎక్క‌డా గొడ‌వ‌లు వినిపించ‌వు. కానీ మ‌న‌స్ప‌ర్థ‌లుంటాయి. తండ్రీ, కొడుకుల మ‌ధ్య విప‌రీత‌మైన అనుబంధం ఉంటుంది. కొడుకు కోసం ఏమైనా చేయాల‌నుకునే ఆ తండ్రి ఏం చేశాడ‌నేదే సినిమా. ఇవాళ్రేపు టీవీల్లో బోలెడ‌న్ని క్రికెట్ మ్యాచ్‌లు వ‌స్తున్నాయి. ఎలాగూ హిట్ అయ్యే నానిని అంతంత సేపు వెండితెర‌మీద మ్యాచ్‌లో చూడటం అనేది.. అందులో ఆస‌క్తి ఉన్న‌వారికి న‌చ్చుతుందేమో కానీ, క్రికెట్ ప‌ట్ల పెద్ద‌గా ఆస‌క్తి లేనివారికి మాత్రం బోర్ కొట్టించే విష‌య‌మే. సినిమా నిడివిని ఇంకాస్త త‌గ్గిస్తే బావుండేది. అక్క‌ర్లేని స‌న్నివేశాలు (ఫ్రెండ్ వైఫ్ ద‌గ్గ‌రికెళ్లి డ‌బ్బులు అడ‌గ‌టం, ప్ర‌వీణ్‌తో కొన్ని స‌న్నివేశాలు) తీసేసినా క‌థాప‌రంగా పెద్ద‌గా వ‌చ్చే మార్పులేవీ ఉండ‌వు. పైగా సినిమాలో వేగం పెరుగుతుంది.
 బాట‌మ్ లైన్‌: స‌మ్మ‌ర్‌లో చూడొచ్చు
రేటింగ్: 2.75

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *