నేటి నుండి కనకదుర్గమ్మ కళ్యాణ బ్రహ్మోత్సవాలు

Kankadurgama Kalyana Bramothsavam from Today

ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ కల్యాణ బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. అమ్మలగన్న అమ్మ..ముగ్గురమ్మల మూలపుటమ్మ.. సాక్షాత్తు పెద్దమ్మ .. దుర్గ మా యమ్మ అని అందరూ కొలిచే దుర్గమ్మ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమై 22 వరకు కొనసాగనున్నాయి. దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు.

శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల కల్యాణ బ్రహ్మోత్సవాలను కన్నులారా వీక్షించేందుకు భక్తులు పోటెత్తారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను నిర్వహకులు పూర్తి చేశారు. వికారి నామ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి నుంచి చైత్ర బహుళ తదియ వరకు గంగా, పార్వతీ(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్ల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 15 ఉదయం 8.30 గంటలకు ఉత్సవమూర్తులకు పండితులు మంగళ స్నానాలు నిర్వహించారు. అనంతరం వధూవరులుగా అలంకరణ చేసారు.

సాయంత్రం 4 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, ధ్వజారోహణ, అగ్నిప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 16న మూలమంత్ర హవనాలు, 17న రాత్రి 8 గంటలకు రాయబార మండపంలో ఎదురుకోలోత్సవం, రాత్రి 10.30 గంటలకు గంగా, పార్వతీ సమేత దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దివ్య లీలా కల్యాణం చేస్తారు. 18న ఉదయం 10 గంటలకు సదస్యం, వేద స్వస్తి నిర్వహిస్తారు. 19న ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి, ధాన్య కొట్నోత్సవం, వసంతోత్సవం, ఉత్సవమూర్తులకు అవభృత స్నానం చేయిస్తారు. 20, 21, 22 తేదీల్లో మల్లేశ్వర స్వామి వారికి పంచహారతులు అనంతరం రాత్రి 9 గంటలకు పవళింపు సేవ నిర్వహిస్తారని వైదిక కమిటీ తెలిపింది.

కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గంగా పార్వతీ సమేత దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను ఏప్రిల్ 15న గజవాహనం, 16న రావణ వాహనం, 17న నంది వాహనం, 18న సింహవాహనం, 19న వెండి రథంపై విజయవాడ పాతబస్తీలో ఊరేగించనున్నారు. నగరోత్సవం ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు మల్లిఖార్జున మహా మండపం నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *