కేసీఆర్ నియంతృత్వ వ్య‌తిరేక పోరాటం

Spread the love

KCR DICTATORSHIP AGAINST FIGHT

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కేవలం తమ జీతభత్యాల కోసమే కాదు ప్రజా సంస్థగా ఆర్టీసీ పరిరక్షణకు ఉద్యమిస్తున్నారని విర‌సం కార్యదర్శి పాణి అన్నారు. వాళ్లవి అత్యంత న్యాయమైన డిమాండ్లు. ఉద్యోగులుగా కనీస సంక్షేమం కోరుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమమప్పుడు, ఎన్నికల సమయంలో ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని స్వయంగా కేసీఆర్‌ ప్రకటించాడు. ఇప్పుడు కార్మికులు అవే అడుగుతున్నారు. దీన్ని కేసీఆర్‌ భరించలేకపోతున్నాడు. అడిగితే, ప్రశ్నిస్తే వినే సంస్కృతి బూర్జువా ప్రభుత్వాలకు బొత్తిగా ఉండదు. అందునా కేసీఆర్‌ పద్ధతి ఎలా ఉంటుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి చూస్తున్నాం. అందుకే ఉద్యమం చేస్తున్న కార్మికులతో చర్చించదల్చుకోవడం లేదు. సమస్యలు పరిష్కరించడం అనే కనీస ప్రజాస్వామ్య పాలనా పద్ధతిని ఆయన పాటించదల్చుకోలేదు. సమ్మె చేయడమే చట్ట వ్యతిరేమని బరితెగించి మాట్లాడుతున్నారు. ఈ కారణం మీదే ఏకంగా 48,000 మంది ఆర్టీసీ కార్మికులను తొలగించేందుకు సిద్ధమయ్యాడు. ఎస్మా ప్రయోగిస్తానని బెదిరిస్తున్నాడు. దాదాపుగా సంస్థలోని సిబ్బంది మొత్తాన్ని తీసేసి, ప్రైవేట్‌ ఉద్యోగులతో సంస్థను నడిపిస్తానని అంటున్నాడు. గత రెండు రోజులుగా ఆ పని ఆచరణలో పెట్టాడు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులను, మద్దతుగా పాల్గొన్న వివిధ పార్టీల, ప్రజాసంఘాల వాళ్లను అక్రమంగా అరెస్టు చేయించాడు. ఇదంతా ఆయన తన ఫ్యూడల్‌ దురహంకారానికి, ప్రజాస్వామ్యం ముసుగులోని బూర్జువా నియంతృత్వానికి నిదర్శనం.

కార్మికులు తమ సంక్షేమం, హక్కుల కోసమే కాకుండా ఆర్టీసీ పరిరక్షణ కోరుకుంటున్నారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని అడుగుతున్నారు. కానీ కేసీఆర్‌ ఆర్టీసీని ప్రైవేటీకరించాలనుకుంటున్నాడు. అందుకే నష్టాల్లో ఉందని తప్పుడు ప్రచారానికి పూనుకున్నాడు. మొత్తానికి ఆర్టీసీని వదిలించుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది ప్రభుత్వ రాజకీయార్థిక విధానం. ఆర్టీసీ కార్మికులు దీన్ని సమరశీలంగా ఎదిరించి పోరాడుతున్నారు. ఉచితాలు, రాయితీలు, పింఛన్లు కాకుండా న్యాయమైన హక్కుల కోసం ఆర్టీసీ కార్మికులు పోరాడుతున్నారు. సంస్థను ప్రైవేటీకరించాలనే కుట్రను ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇది ప్రజల పోరాటం. ప్రజా అవసరాలు తీర్చే పోరాటం. ఈ పోరాటానికి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధి జీవులు పూర్తిగా సంఘీభావం ప్రకటించాలి. ప్రజా రవాణా సంస్థ అయిన ఆర్టీసీని బతికించు కోవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉన్నది. అందుకు వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి వారికి అన్నివిధాలుగా అండగా నిలబడదాం.

Telangana Updates

Telangana RTC Latest news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *