కేసీర్ పాలనా? తుగ్లక్ పాలనా?

kcr rule or tughlaq rule?

ఒక ఇంట్లో పిల్లాడు మారం చేస్తే.. ఆ తండ్రి ముందుగా బుజ్జగిస్తాడు. అయినా వినకపోతే, నయానో భయానో ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. ఇంకా ఆ బాబు మొండికేస్తే.. వినేలా లేడని.. ఇంకోసారి అడగొద్దు.. ఈ ఒక్కసారి ఓకే అని పిల్లాడు అడిగింది కొనిచ్చేస్తాడు. అలా కాకపోతే, కొట్టి బెదిరించడానికైనా ప్రయత్నిస్తాడు. కానీ, ఇక్కడేమిటో.. కొడుకు అడిగాడని ఏకంగా వాడిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టడమే కాకుండా చంపేయడానికి సిద్ధమయ్యాడా ఇంటి పెద్ద. ఇది ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్రానికి పెద్ద అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు అని పలువురు ప్రజలు మండిపడుతున్నారు.

ఒక రాష్ట్రంలో సమస్య వస్తే.. రాష్ట్ర పెద్దగా పరిష్కరించడానికి ప్రయత్నించాలి తప్ప మొండికేస్తే ఎలా? ఒకప్పుడు పాలకుడు తెలంగాణకు నయాపైసా ఇవ్వను అన్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్ దద్దమ్మళ్లు ఎక్కడున్నారు? అని అనేకసార్లు బహిరంగంగా తిట్టిన కేసీఆర్ ప్రస్తుతం చేస్తున్న పని ఏమిటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గ్రహించి.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఆందోళనను నిలువరించడానికి ఆనాటి కాంగ్రెస్ పెద్ద సోనియా గాంధి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. కానీ, ఈనాడు.. తెలంగాణ వచ్చిన ఆరేళ్ల తర్వాత.. స్వరాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో  కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులు బలిదానాలు చేసుకుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ వాటిని నిలువరించే ప్రయత్నం చేయాలా? వద్దా? ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? అని తెలంగాణ సమాజం నిలదీస్తుంది.

రాష్ట్రంలో అనేక ప్రభుత్వ ఆఫీసుల్లో ఉదయం పూట అలా పంచ్ కొట్టి.. బయటి పనులు చూసుకుని తిరిగి సాయంత్రం వచ్చి పంచ్ కొట్టి వెళ్లే ఉద్యోగులు చాలామంది ఉంటారు. ఒకసారి పంచ్ కొట్టాక సొంత పనులు చేసుకునేవారూ లేకపోలేరు. కానీ, ఆర్టీసీ ఉద్యోగులు అలా కాదు. బస్ డ్రైవర్ ఒకసారి స్టీరింగ్ ముందు కూర్చుంటే విజయవాడ అంటే విజయవాడకు వెళ్లాలి. చెన్నై అంటే చెన్నైకి వెళ్లాలి. అంతే తప్ప, తాను ఇతర ఉద్యోగుల  మాదిరిగా పంచ్ కొట్టి సొంత పనులు చేసుకునే పరిస్థితుల్లుండవు. కండక్లర్ అయినా ఇదే పరిస్థితి. నగరాల్లో ఎంత ప్రతికూల పరిస్థితుల్లో, అనేక ఒత్తిడిల మధ్య వీరు పని చేస్తుంటారు. మరి, ఇలాంటి డ్రైవర్లు, కండక్టర్లు సమ్మె చేస్తుంటే.. వారి సముదాయించాల్సింది పోయి.. రాత్రికి రాత్రే ఉద్యోగుల నుంచి తీసివేస్తున్నానని సీఎం ప్రకటించడం ఎంత బాధ్యతారాహిత్యం? అసలు ఏ  రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటాడా? ఇది కేసీర్ పాలనా? తుగ్లక్ పాలనా? అంటూ ప్రజలు మండిపడుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్యలు చేసుకోవడం మాత్రం క్షమించరాని నేరమని ప్రజలు మూకుమ్మడిగా అభిప్రాయపడుతున్నారు. అది తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి పూర్తి వైఫల్యమని విమర్శిస్తున్నారు. మూడు రోజుల్లో పూర్తి బస్సులు తిరగాలని అల్టిమేటం ఇవ్వడమేమిటని అంటున్నారు. ఇప్పటికే తాత్కాలిక డ్రైవర్లు రోడ్ల మీద హంగామా చేస్తున్నారు. అందుకే, వాటిలో ఎక్కేందుకు ప్రజలు భయపడుతున్నారు. ఆర్టీసీ సమస్యకు పరిష్కారం చూపకుండా, స్కూళ్లకు వారం రోజులు సెలవులు ప్రకటించడం అన్యాయమని అంటున్నారు. ఇప్పటికైనా కేకే మధ్యవర్తిత్వంతో ఆర్టీసీ సమ్మెను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని కోరుతున్నారు.

telangana rtc updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *