జగన్ ను చూసి నేర్చుకో అంటూ కేసీఆర్

Spread the love

KCR Said Learn from JAGAN

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులను ఆయన తప్పుపట్టారు. సీఎం కేసీఆర్ వైఖరి కరెక్ట్ కాదన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఏపీ సీఎం జగన్ ని చూసి కేసీఆర్ నేర్చుకోవాలని నారాయణ హితవు పలికారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకునేది లేదని జగన్ అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారని, ఒక వేళ తీసుకోవాల్సి వస్తే.. వారితో రాజీనామాలు చేయిస్తామని జగన్ చెప్పారని నారాయణ గుర్తు చేశారు. అలా చెప్పే ధైర్యం కేసీఆర్ కి ఉందా అని నారాయణ నిలదీశారు.
కేసీఆర్ కంటే జగన్ చిన్నోడని.. కానీ ఫిరాయింపుల విషయంలో జగన్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలని నారాయణ సూచించారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, సీఎం కేసీఆర్ ముగ్గురూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని నారాయణ ఆరోపించారు. ప్రతిపక్షం లేకపోతే ప్రజలే ప్రతిపక్షంగా మారుతారని హెచ్చరించారు. పశ్చిమమెంగాల్ లో ప్రభుత్వం లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందన్నారు. తెలంగాణలో ఎంఐఎం ప్రతిపక్షం అయితే ప్రజలకు ఒరిగేదేమీ లేదని నారాయణ అన్నారు. ఎంఐఎం కేసీఆర్ వంటింటి కుందేలు అని అన్నారు.

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఏఐటీయూసీ కార్యాలయం నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహానికి వెళ్తుండగా పోలీసులు నారాయణను అరెస్ట్ చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలును ఆపాలని నారాయణ డిమాండ్ చేశారు. ఓటర్లు ఎంతో నమ్మకంతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే.. సిగ్గు లేకుండా పార్టీలు మారుతున్నారని నారాయణ మండిపడ్డారు. జనాన్ని మోసం చేసిన వ్యక్తి.. కుటుంబ సభ్యులను కూడా అమ్మడానికి వెనుకాడరని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై దాడులు చేయాలని, వారి బట్టలు ఊడదీసి ఊరేగించాలని, ప్రజా కోర్టులో శిక్షించి, అవమానించాలని నారాయణ అన్నారు. అంతేకానీ.. న్యాయస్థానాలను ఆశ్రయించడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.
తెలంగాణలో 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ టికెట్ పై గెలిచి టీఆర్ఎస్ లో చేరడం పట్ల విమర్శలు వస్తున్నాయి. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలు పోరుబాట పట్టారు. ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని, ప్రతిపక్షం అనేది లేకుండా చెయ్యాలని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలు న్యాయపోరాటం చేస్తున్నారు. కోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కి, పార్టీ మారిన వారికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *