సికింద్రాబాద్ నుండి బీజేపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి ఫైనల్ ?

Kishan Reddy Final For Secunderabad Constituency From BJP

తెలంగాణ రాష్టంలో ముందస్తు ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న బీజేపీ ఒక్క సీటు మాత్రమే సంపాదించింది. అయితే లోక్ సభ ఎన్నికల్లో అయినా ఉనికి చాటుకునే యత్నం చెయ్యనుంది బీజేపీ పార్లమెంట్ బరిలో 17 స్థానాలలో నిలబడాలని భావిస్తుంది. మోడీ మానియా వర్క్ ఔట్ అవుతుందేమో అని ఆశగా ఉన్న బీజేపీ.. సీట్లు సర్ధుబాటుపై చర్చలు జరుపుతుంది. ఈ క్రమంలో బీజేపీకి అంతో ఇంతో పట్టు ఉన్న నియోజక వర్గం సికింద్రాబాద్‌‌పై సీనియర్ నేతలు కన్నేశారు.
అయితే సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పోటీ చేయడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. సిట్టింగ్‌ ఎంపీ, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ బరిలో ఉంటానని ప్రకటించినప్పటికీ పార్టీ నాయకత్వం కిషన్‌రెడ్డిని ఆ స్థానం నుండి నిలబెట్టాలనే ఆలోచనలో ఉంది. ఇవాళ కేంద్ర ఎన్నికల కమిటీ మరోసారి సమావేశమై తొలివిడత అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకోనుంది.
2018 ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనంలో కిషన్ రెడ్డి ఓడిన సంగతి తెలిసిందే. అంతకుముందు 2004లో హిమాయత్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి, 2009, 2014లో అంబర్‌పేట నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక బండారు దత్తాత్రేయ సికింద్రబాద్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. మరోవైపు ఇదే స్థానం నుండి పోటీ చేయాలని ముషీరాబాద్ నుండి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సైతం అనుకున్నారు. ఫైనల్ గా కిషన్ రెడ్డి ఎంపీ బరిలో సికింద్రాబాద్ నుండి రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *