కిషన్ రెడ్డి.. అసహాయ మంత్రి

3
Kishan Reddy is Helpless Minister
Kishan Reddy is Helpless Minister

Kishan Reddy is Helpless Minister

కిషన్ రెడ్డి మనిషి మంచోడే కానీ అసహాయ మంత్రి అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం నారాయణపేట ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ.. గొర్రె తోక ఎంతో బీజేపీ అంతేనని దుయ్యబట్టారు.  ఐటీఐఆర్ ఇస్తే హైదరాబాద్ అభివృద్ది చెందుతుందన్న అక్కసుతో దానిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దుచేసిందన్నారు. దేశాన్ని మోసం చేసిన వారిని దేశం దాటించడమే ఈ ఆరేళ్లలో బీజేపీ చేసిందని, పులినోట్ల మేక పిల్లను పెట్టినట్లు కొత్త వ్యవసాయ చట్టాలతో రైతుల కష్టాన్ని కేంద్రం కార్పోరేట్ల చేతుల్లో పెట్టారని తెలిపారు. ప్రభుత్వ సంస్థలను అమ్మడానికి బీజేపీయే కావాలా? ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు ఎక్కడ అని నిలదీశారు.

  • కేసీఆర్ ఏం చేయనిదే మూడున్నరేళ్లలో 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తయిందా? కేసీఅర్ ఏం చేయనిదే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పనులు 70 శాతం పూర్తయిందా? అని ప్రశ్నించారు. గత వానాకాలం, ఈ యాసంగిలో రూ.15 వేల కోట్లు రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాలలో జమ చేశామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడానికి ప్రధానమంత్రే కావాలా?  ఏ ప్రభుత్వ అధికారిని ఆదేశించినా ఆ పనిచేస్తాడని తెలిపారు. నష్టాల్లో ఉన్న సంస్థలను లాభాల్లోకి తెచ్చి నడిపించడమే పాలకుడి దక్షత అన్నారు. కరోనా మూలంగా ప్రపంచం అంతా నష్టపోతే అంబానీ సంస్థలకు లాభాలు ఎలా వచ్చాయన్నారు.
  • లక్షల కోట్ల వనరులున్న కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను నడపలేకపోతే 60 వేల పెట్టుబడితో సంస్థలను ప్రారంభించిన అంబానీలకు, ఆదానీలకు నడపడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఆరున్నరేళ్లలో 14000 పరిశ్రమలకు అనుమతిస్తే 15 లక్షల మందికి ఉపాధి దొరికిందని వెల్లడించారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచిందన్నారు. నల్లధనాన్ని తీసుకొస్తా .. ప్రతి ఒక్కరి జనధన్ ఖాతాలో 15 లక్షలు వేస్తానన్న మోడీ ఏం చేశాడని నిలదీశారు. ఈ ఆరున్నరేళ్లలో ఒక్క బీజేపీ నేత అయినా తెలంగాణ వాటాకు మించి అదనంగా ఒక్క రూపాయి తీసుకొచ్చాడా? అని ఎద్దేవా చేశారు.

Telangana Mlc Elections 2021 Live