చంద్రబాబు నక్క అంటూ నాని ఫైర్

KODALI NANI FIRED ON CBN

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును మంత్రి కొడాలి నాని నక్కతో పోల్చారు. బాబువన్నీ జిత్తులమారి నక్క బుద్దులంటూ ఫైర్ అయ్యారు. ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణంపై తమ పార్టీ మీద ఆరోపణలు వస్తుండటంతో నాని తీవ్రంగా స్పందించారు. కేసుల వల్లో, ప్రభుత్వ వేధింపుల వల్లో కోడెల ఆత్మహత్య చేసుకోలేదని పేర్కొన్నారు. నమ్ముకున్న సొంత మనుషులే ఆయన్ను నట్టేట ముంచడంతో ఇంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయపడ్డారు. కేసులు, వేధింపులకు భయపడే పిరికివాడు కాదని, అలాంటి వాటిని రాజకీయంగానే ఎదుర్కొనే సమర్థుడు కోడెల అని వ్యాఖ్యానించారు. అయితే, తాను నమ్ముకున్న కుటుంబ సభ్యుల వల్లో లేదా పార్టీ అధినేత వల్లో  ఇబ్బందులు ఎదురైనప్పుడే ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.

ఆత్మహత్య చేసుకునేంత వరకు కోడెలను పట్టించుకోని బాబు.. ఇప్పుడు ఆయన భౌతికకాయాన్ని పక్కన పెట్టుకుని శవ రాజకీయాలు చేస్తున్నారని నాని మండిపడ్డారు. పల్నాటి పులి అంటూ ఇప్పుడు కోడెలను అభివర్ణిస్తున్నారని.. మరి ఇంతకాలం అదంతా ఏమైపోయిందని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ బాధితుల క్యాంపు అంటూ పల్నాడులో ఏర్పాటు చేసిన శిబిరానికి కోడెల ఎందుకు రాలేదని నిలదీశారు. ‘‘ఆయన కూడా వైఎస్సార్ సీపీ బాధితుడే అంటున్నారు కదా? మరి ఆయన సొంత ప్రాంతమైన పల్నాడులో మీరు ఏర్పాటు చేసిన బాధితుల శిబిరానికి కోడెల ఎందుకు రాలేదు? ఆయన వస్తానంటే మీరు వద్దన్నారా? లేక ఆయనే మీకు దూరంగా ఉన్నారా చెప్పాలి’’ అని చంద్రబాబును ఉద్దేశించి నాని డిమాండ్ చేశారు. కోడెల పులి అయితే చంద్రబాబు నక్క అని వ్యాఖ్యానించారు. గత పది రోజులుగా అపాయింట్ మెంట్ కోసం కోడెల ప్రయత్నిస్తున్నప్పటికీ, చంద్రబాబు ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని నాని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కోడెల మరణానికి బాబే ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమని దుయ్యబట్టారు.

AP NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *