కోడెల శివప్రసాద్ ఆత్మహత్య

KODELA SUICIDE

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఉరి వేసుకున్నారని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఆయన ఆత్మహత్యాయత్నాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కోడెలను బసవతారకం కేన్సర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అత్యంత విషమంగా ఉన్న ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స చేశారు. వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ, శ్వాస అందక పరిస్థితి విషమించి కన్ను మూసినట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా పలు కేసులు, ఆరోపణలతో కోడెల సతమతమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా ఆయన పరిస్థితి మరింత ఇబ్బందిగా మారింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కే ట్యాక్స్ పేరుతో ఆయన కుమార్తె, కుమారుడు గుంటూరు జిల్లాలో చాలామందిని వేధించారని ఆరోపణలు వచ్చాయి.

ఏపీలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంతో ఆయనపై బాధితులు కేసులు పెట్టారు. ఈ క్రమంలో కొంతమందితో కోడెల కుటుంబం రాజీకి కూడా వచ్చింది. అనంతరం అసెంబ్లీ ఫర్నిచర్ ను కూడా కోడెల తన ఇంటికి తీసుకెళ్లారనే ఆరోపణలు ఆయన్ను మరింత బాధించాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల ఆయన అస్వస్థతకు గురి కాగా, గుంటూరులోని ఆయన ఆస్పత్రిలోనే చికిత్స చేశారు. అనంతరం ఆదివారం ఆయన హైదరాబాద్ వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసులు తదితర అంశాలపై ఆదివారం రాత్రి కుమారుడితో ఘర్షణ జరిగినట్టు సమాచారం. అనంతరం ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో మంత్రిగా, స్పీకర్ గా పనిచేసిన కోడెల.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన 1983లో నరసరావుపేట నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి స్పీకర్ గా పనిచేశారు.

BREAKING NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *