గులాబీ గూటికి చేరనున్న కొల్లాపూర్ ఎమ్మెల్యే

కాంగ్రెస్ కు షాక్ … Kolapur MLA Joining in TRS

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుంటే కాంగ్రెస్ పార్టీ కి వరుస షాకులు తగులుతున్నాయి. ఒకరి తరువాత ఒకరు ఊహించని విధంగా పార్టీ మారుతున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో కొల్లాపూర్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై ఆయన చర్చలు జరిపారు. మరోవైపు వలసలతో టీ-కాంగ్రెస్‌ విలవిల లాడుతోంది. ముఖ్యనాయకులంతా ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కీలక నేతలు పార్టీని వీడుతుండటంతో కాంగ్రెస్‌ అధిష్టానం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే గులాబీ ఆకర్ష్‌తో డీలాపడ్డ హస్తం పార్టీ. బీజేపీ ఆకర్ష్‌తో దిక్కుతోచని స్థితికి చేరుకుంది. డీకే అరుణ నిష్క్రమణతో కాంగ్రెస్‌ నేతలు షాక్‌కు గురయ్యారు. దీంతో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీభవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో బుధవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వారు ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.
మొన్నటిదాకా టీఆర్ఎస్పార్టీ లోకి వెళ్ళిన నాయకులు ఇప్పుడు బీజేపీ ఆకర్ష్ లో పడకుండా ఆపటం ఎలా అని వారు సమీక్షిస్తున్నారు. పార్టీ నుంచి వలసలు ఎలా ఆపాలని టీపీసీసీ యోచిస్తోంది. పార్టీలో సీనియర్ నేతలు కూడా పార్టీని వదిలి పెట్టి వెళ్లటం పట్ల పలువురు నేతలు ఆందోళనలో ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి,డీకే అరుణతో సహా ఇప్పటి వరకు 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడుతున్నారనే వార్తలు వస్తుండటంతో ఈ వలసలకు ఎలా టెక్ పెట్టాలా అనే ఆలోచనలో పార్టీ ఆధినాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. పార్టీ వీడుతున్న నాయకులంతా రాష్ట్ర నాయకత్వం పైన ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర పార్టీ నాయకత్వం కలుపుకు పోవటం లేదు. ఏక పక్షంగా వెళుతోందని, సమర్ధవంతంగా పని చేయటం లేదు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర నాయకులు కార్యకర్తల్లో భరోసా నింపటంలేదని , సీనియర్లను అగౌరవ పరిస్తున్నారంటూ రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రస్తుత పరిస్ధితి కేడర్ ను డీలా పడేలా చేస్తోంది. ఈ పరిస్దితిని అధిగమించటానికి ఏం చెయ్యలనే దానిపై టీపీసీసీ గాంధీ భవన్లో సమీక్షిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *