కొండగట్టు ప్రమాదానికి సరిగ్గా ఏడాది

Spread the love

KONDAGATTU ACCIDENT IN KARIMNANGAR DISTRICT

కరీంనగర్ జిల్లాలో ఆంజనేయ స్వామి కొలువుదీరిన కొండగట్టు ప్రాంతంలో సరిగ్గా ఏడాది కిందట జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదం ఇంకా జిల్లా వాసుల కళ్లల్లో మెదులుతూనే ఉంది. ఆనాటి ఆ ఘోర ప్రమాదాన్ని ఇంకా మరిచిపోలేక పోతున్నారు. ఆర్టీసీ అధికారుల ఆదాయపు లెక్కలు 65 మంది నిండు ప్రాణాలు బలిగొన్నాయి. డిజీల్ తక్కువగా వాడి సంస్థ ఆదాయం పెంచాలన్న ఆలోచనతో డ్రైవర్లకు ప్రతి నిత్యం పాఠాలు నూరిపోస్తూ ఆ ప్రమాదానికి సాక్షి భూతాలుగా నిలిచారు ఆర్టీసీ అధికారులు.
పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోవద్దనే నిబంధనను బేఖాతరు చేశారు ఆర్టీసీ అధికారులు. ఆక్యుపెన్సీ రేషియా కొండగట్టు బస్సు ప్రమాదంలో కొంప ముంచింది. దేశంలోనే అతి పెద్ద ప్రమాదంగా రికార్డుల్లోకి ఎక్కింది. వంద మందికి పైగా ప్రయాణీకులతో బయలుదేరిన ఆ ఆర్టీసీ బస్సు ప్రమాదంలో అక్కడికక్కడే 24 మంది చనిపోయారు. మరో 41 మంది చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఇంకెందరో ఆనాటి గాయాలు మానక మంచానికే పరిమతం అయ్యారు. ఆనాటి బాధితుల్లో ఇంకా ఏడుగురికి ఈనాటికీ పరిహారమే అందలేదు.ఆనాటి బస్సు ప్రమాదంలో అయినవారిని కోల్పోయి కుటుంబ సభ్యులు ఇప్పటికీ దుఃఖసాగరంలో కనిపిస్తున్నారు. గాయపడి ఇంకా కోలుకోలేని పరిస్థితి నరకప్రాయంగా తయారైంది. ఆనాటి ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలు, గాయపడ్డ బాధితులది ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ. 65 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 50 మంది వరకు గాయపడ్డారు. అదలావుంటే ప్రభుత్వం అందించిన పరిహారం తూతూ మంత్రంగానే ఉంది తప్ప బాధితుల వేదన మాత్రం తీర్చలేకపోయింది.ఇంతకు ఆ ప్రమాదం ఎలా జరిగింది.. ఎవరిని బాధ్యులను చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణులు ఏం తేల్చారు. ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు సమాధానాలు లేకుండా పోయాయి. ఆ ప్రమాదం జరిగి నేటికీ ఏడాది గడుస్తున్నా.. ఇంతవరకు అది ఎలా జరిగిందనేది మాత్రం స్పష్టం చేయలేకపోయారు అధికారులు. ఇప్పటికీ ప్రమాదానికి గురైన ఆ బస్సు మల్యాల పోలీస్ స్టేషన్‌లోనే క్షేమంగా ఉంది. వానకు నానుతూ, ఎండకు తడుస్తూ భద్రంగా ఉంది. కానీ 65 మందిని పొట్టన పెట్టుకున్న మృతుల కుటుంబాలకు మాత్రం ఎలాంటి భరోసా లేకుండా పోయింది. ఆ కుటుంబాల పరిస్థితి దయనీయంగానే ఉంది.

TELANGANA FIRST TRIBAL WOMEN MINISTER

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *