అసమ్మతిని అణిచివేసిన కేటీఆర్?

KTR PACIFY REBELS

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అనంతరం చెలరేగిన అసమ్మతి జ్వాలలను అణచివేయడంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాదాపుగా విజయవంతమయ్యారు. మంత్రివర్గంలో చోటు లభించలేదంటూ పలువురు పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారనే వార్తలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. టి.రాజయ్య, జోగు రామన్న, మైనంపల్లి హనుమంతరావు, జూపల్లి కృష్ణారావు, బాజిరెడ్డి గోవర్థన్, అరికెపూడి గాంధీ నిరసన వ్యక్తంచేశారని వార్తొలలొచ్చాయి. వీరిలో ముగ్గురు నేతలు బీజేపీలో చేరతారనే ప్రచారం జరిగింది. దీంతో అప్రమత్తమైన పార్టీ అధిష్టానం.. వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభించింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగి.. వారందరితో విడివిడిగా మాట్లాడారు. సామ, దాన, దండోపాయాలు ప్రయోగించారు. పార్టీ మారాలనే ఆలోచన వద్దని, అన్ని విధాలా అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. ఒకవేళ పార్టీ మారితే మాత్రం సహించేది లేదని హెచ్చరించినట్టు తెలిసింది. పార్టీ మారితే వెంటనే శాసనసభ సభ్యత్వంపై వేటు వేస్తామని, అంతేకాకుండా గతంలో జరిగిన వ్యవహారాలకు సంబంధించి కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టంచేసినట్టు సమాచారం. దీంతో రాజయ్య, జూపల్లి, బాజిరెడ్డి, జోగు రామన్న మీడియా ముందుకు వచ్చి.. తాము టీఆర్ఎస్ లోనే కొనసాగుతామని, పార్టీకి విధేయంగా ఉంటామని పేర్కొన్నారు. తద్వారా పార్టీలో రేగిన అసమ్మతిని కేటీఆర్ చాకచక్యంగా సద్దుమణిగేలా చేశారు.

TS POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *