న్యాయవాదుల హత్యపై హైకోర్టు సీరియస్

69

న్యాయవాద దంపతులను నడిరోడ్డుపై హత్య చేయడం తీవ్ర గర్హనీయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసును సమోటోగా తీసుకుంటామని  స్పష్టంచేసింది. వెంటనే ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్దిష్ట కాలపరిమితితో ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.

లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని, ఈ కేసులో ప్రభుత్వం తన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించింది. సాక్ష్యాలను పకడ్బందీగా స్వీకరించాలని, నిందితులను పట్టుకోవాలని స్పష్టంచేసింది. కేసు విచారణను మార్చి ఒకటో తేదీకి వాయిదా వేసింది.

హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, వెంకట నాగమణిలను బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద దుండగులు నడిరోడ్డుపై కిరాతకంగా హత్య చేశారు. ఈ క్రమంలో కొనఊపిరితో ఉన్న వామనరావు.. తమపై దాడి చేసింది మంథని టీఆర్ఎస్ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్ అని చెప్పారు. మరోవైపు టీఆర్ఎస్ నేత పుట్టా మధుకు కూడా ఈ వ్యవహారంలో ఏమైనా ప్రమేయం ఉందా అనే చర్చ జరుగుతోంది.

హత్యకు కొన్ని గంటల ముందు ప్రధాన నిందితుడు శ్రీనివాస్.. మధుతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఉదయం 10 గంటలకు కేసీఆర్ జన్మదినం సందర్భంగా బర్త్ డే కేక్ కట్ చేశారు. అక్కడ మధు పక్కనే శ్రీనివాస్ ఉన్నాడు. అనంతరం 11 గంటల నుంచి 11.30 గంటల వరకు దుబ్బుపల్లిలో పూజా కార్యక్రమంలో ఇరువురూ పాల్గొన్నారు. 12 గంటలకు గోదావరి ఖని వచ్చి కోర్టు వద్ద రెక్కీ నిర్వహించినట్టు సమాచారం.

12.30 నుంచి 12.40 గంటల మధ్య మధు తన కాన్వాయ్ ఆపి శ్రీనివాస్ తో ఏకాంతంగా చర్చలు జరిపారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కల్వచర్ల వద్ద హత్య జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here