మే వరకూ ఆగితే కొంపలు మునిగిపోతాయా?

Lets Wait Till May 3rd

హడావిడి ఎందుకు? తొందర ఎందుకు? రెండు వారాలు ఆగితే కొంపలు మునిగిపోతాయా? మే 20 రోజున పనులు ప్రారంభించినంత మాత్రాన బ్యాంకర్లు రుణాల్ని మంజూరు చేస్తారా? కొనుగోలుదారులు తమ సొమ్ము చెల్లిస్తారా? సొమ్ము గురించి ప్రెషర్ పెడితే చాలు.. ఫ్లాట్ క్యాన్సిల్ చేసినా చేస్తాడు. కాబట్టి, తొందర పడకుండా.. కరోనా పూర్తిగా తొలగిపోయిన తర్వాత, అంటే మే3 లాక్ డౌన్ పూర్తయ్యాక.. ఎంచక్కా నిర్మాణ పనుల్ని ప్రారంభించేద్దాం. మన చుట్టూ ఉన్న సమాజంతా ప్రశాంతంగా ఉన్నప్పుడే పనుల్ని మొదలెడదాం. కావాలంటే, అప్పుడు ఇరవై నాలుగు గంటలు కష్టపడి పని పూర్తి చేద్దాం. ఇప్పటికే ఎంతో నష్టపోయాం. ఎన్నేళ్లు కష్టపడితే ఈ నష్టంలో నుంచి బయటపడతామో తెలియదు. ఎన్ని నెలలు ఒళ్లు వంచి పని చేస్తే నష్టం తగ్గుతుందో తెలియదు. కాబట్టి, మొత్తం కుదురుకున్నాక నిర్మాణ పనుల్ని ఆరంభిస్తే బెటర్. ఎందుకో తెలుసా?

ప్రస్తుతం సైట్లలో ఉన్న లేబర్ క్యాంపుల్లో ఉన్నవారితో పనులు ప్రారంభిస్తే సరిపోతుందా? పని చేయాలంటే, వారొక్కరు ఉండగానే సరిపోతుందా? బయట్నుంచి జనాలు రావాల్సిన అవసరం లేదా? నిర్మాణ సామగ్రి రావొద్దా? అది రావాలంటే ఏదో ఒక వాహనంలో డ్రైవర్లు తేవాల్సిందే కదా.. పనులు చేయించే సూపర్ వైజర్లు, సైట్ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, ఇతరత్రా పనివాళ్లు ఉండాల్సిందే కదా. బిల్డర్లు, డెవలపర్లూ సైట్ వద్దకు వెళ్లాల్సిందే కదా. మరి, వీళ్లల్లో ఏ ఒక్కరికైనా కరోనా సోకిందంటే,  అతని ద్వారా వలస కార్మికులకు, పని చేసేవారికి కరోనా సోకిందంటే, మన హైదరాబాద్ కూడా మరో ఇటలీ, ఫ్రాన్స్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి, ఒక్క రెండు వారాలు వేచి చూడటం వల్ల కొత్తగా వచ్చే నష్టమేం లేదు. పని మొదలెట్టకపోతే ఏదో కొంపలు మునుగుతాయని లేదు. ప్రపంచమంతా కరోనా వల్ల అతలాకుతలం అవుతుంది. మనమేం మినహాయింపు కాదు. రెండు వారాలు వేచి చూస్తే.. అంతా సద్దుమణిగాక సంతోషంగా పనులు మొదలెట్టొచ్చు. లేకపోతే, మన తప్పిదం వల్ల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటం అంతా వ్యర్థమవుతుంది. వైద్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది చేస్తున్న శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. కాబట్టి, ఒక్క రెండు వారాలు వేచి చూద్దామని హైదరాబాద్లోని పలువురు డెవలపర్లు అభిప్రాయపడుతున్నారు.

Hyderabad RealEstate Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *