లోక్ సభ పోరులో కారు జోరు తగ్గనుందా ?

LOKSABA ELECTION TRS MAY GET LESS SEATS

తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కారు దూసుకుపోయిందా? అన్ని స్థానాల్లో కారు విజయం సాధిస్తుందా ? తెలంగాణా ప్రజలు 16 నియోజకవర్గాలను కారెక్కిస్తా అంటే చెప్పలేము అని సమాధానం చెప్పొచ్చు అంటున్నారు . అధికార పార్టీ లోక్ సభ ఎన్నికల్లో 16 మావే అని సవాల్‌ విసిరితే ఈ సారి చేతిలో సరిపడా సీట్లను సాధిస్తామని కాంగ్రెస్‌ ప్రతిసవాల్‌ చేసింది. మధ్యలో కమలం మేము కూడా వికసిస్తాం అని బీజేపీ బరిలోకి దిగింది. తెలంగాణలో ముక్కోణపు ఎలక్షన్‌ మ్యాచ్‌లో విక్టరీ ఎవరిది..?అంటే మే 23 వరకు ఆగండి అని చెప్పక తప్పని పరిస్థితి .

17 పార్లమెంట్‌ స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో పోలింగ్‌ శాతం తక్కువగా నమోదు కావడంతో ప్రధాన పార్టీల్లో విజయంపై అంతర్మథనం మొదలైంది. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన టీఆర్‌ఎస్ 16 సీట్లే లక్ష్యంగా బరిలోకి దిగింది. అయితే శాసనసభలో ఘోర పరాభవం తర్వాత కాంగ్రెస్‌ మరోసారి ప్రజాక్షేత్రంలో పరీక్షను ఎదుర్కొంది. ఈ మధ్యలో ఎలాగైన ఖాతా తెరిచేందుకు బీజేపీ శాయశక్తులా ప్రయత్నించింది. అయితే అధికార టీఆర్ఎస్‌కు కొన్ని చోట్ల కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇవ్వగా మరికొన్ని స్థానాల్లో బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా మారింది.

ముఖ్యంగా మల్కాజ్‌గిరి, నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌గా మారగా మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌‌, కరీంనగర్‌ నియోజకవర్గాల్లో పోరు టీఆర్ఎస్‌ వర్సెస్‌ బీజేపీగా మారింది. దీంతో ప్రతిపక్షాలు టీఆర్ఎస్‌ ఆశలకు ఎంతమేర గండి పెడతాయనేది ఆసక్తికరంగా మారింది. 2014 తో పోలిస్తే ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఈ సారి తక్కువగా పోలింగ్‌ నమోదైంది. పర్సంటేజీలో సుమారు 4 శాతం తక్కువగా కనిపిస్తుంది.

దీంతో ఈ తగ్గిన ఓట్లశాతం ఎవరిపై ప్రభావం చూపుతుందో అని ప్రధాన పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. మొత్తం 7 అసెంబ్లీ స్థానాలున్న ఈ నియోజకవర్గంలో ఈ సారి 71.44 శాతం ఓటింగ్‌ నమోదైంది. మరోవైపు రెండు పార్లమెంట్‌ స్థానాలున్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఈ సారి రసవత్తర పోరుకు వేదికైంది. కరీంనగర్‌లో టీఆర్ఎస్‌ వర్సెస్‌ బీజేపీగా పోలింగ్‌ సాగగా పెద్దపల్లిలో మాత్రం కాంగ్రెస్‌ వర్సెస్‌ టీఆర్ఎస్‌ మధ్య హోరాహోరీగా సాగింది. ఈ రెండు స్థానాల్లో మెజార్టీ సాధించడం కంటే విజయం వస్తే చాలనే ధోరణిలో పార్టీలున్నట్లు తెలుస్తోంది. మెజార్టీ కూడా లక్ష నుంచి లక్షన్నర లోపే వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఆసక్తిగొల్పిన నిజామాబాద్‌లో విజయం ఎటువైపనే దానిపై ఆసక్తి నెలకొంది. 185 మంది బరిలోకి దిగిన ఈ ఎన్నికలో రైతులు ఎంతమేర ప్రభావం చూపుతారనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్‌ వర్సెస్‌ బీజేపీ మధ్యే పోటీ సాగిందని విశ్లేషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *