శ్రీవారి ఆభరణాలపై అనుమానాలు నివృత్తి చేస్తాం

Spread the love

Lord Venkateswar Gold Issue

టీటీడీలో అభివృద్ధికి ఆటంకం కలగకుండా నూతన పాలకమండలిని నియమిస్తామన్నారు. త్వరలో ఆర్డినెన్స్ ద్వారా టీటీడీ బోర్డుని రద్దు చేస్తామని ఏపీ దేవాదాయశాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ చెప్పారు. శ్రీవారి ఆభరణాలపై అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత టీటీడీ అధికారులపై ఉందని మంత్రి చెప్పారు. శ్రీవారి ఆభరణాల భద్రతపై టీటీడీ అధికారులతో సమీక్షిస్తామన్నారు. శ్రీవారి సొమ్ము తిన్నోళ్లను వదిలిపెట్టేది లేదని మంత్రి తేల్చి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో వంశ పారపర్యంగా వస్తున్న అర్చకత్వానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. బుధవారం(జూన్ 19,2019) ఉదయం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

టీడీపీ ప్రభుత్వం నియమించిన పాలక మండలి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయకపోవడంతో, ఆర్డినెన్స్‌ ద్వారా ప్రస్తుత పాలక మండలిని తొలగించాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు. తిరుమల శ్రీవారి బంగారం తరలింపుపై విచారణ జరిపిస్తామన్నారు. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. భక్తుల కానుకలతో అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. టీటీడీలో తలెత్తిన అన్ని వివాదాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. పురాతన నాణేలతో తయారు చేసిన మెమెంటో వివాదాలపై విచారణ జరిపిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం హయాంలో టీటీడీ చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకం జరిగింది. ప్రభుత్వం మారినా.. ఆయన మాత్రం తన పదవి నుంచి దిగిపోవడం లేదు. దీంతో సుధాకర్ యాదవ్ వ్యవహారాన్ని నూతన ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మరోవైపు పుట్టా సుధాకర్‌ యాదవ్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో పుట్టా సుధాకర్ యాదవ్ అవినీతికి పాల్పడ్డారంటూ స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ ఫిర్యాదు చేశారు. తాను సిఫారసు చేసిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ స్విమ్స్‌ డైరెక్టర్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు టీటీడీ వర్గాలు చెప్పాయి. స్విమ్స్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ తీర్మానాలకు వ్యతిరేకంగా ఉద్యోగాలు ఇవ్వాలని సుధాకర్‌ యాదవ్‌ కోరుతుండటంతో స్విమ్స్‌ డైరెక్టర్‌ ఈ విషయంపై టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై విచారణ నిర్వహించిన టీటీడీ అధికారులు దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది.

తనపై వచ్చిన ఆరోపణలను టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఖండించారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెబుతున్నారు. తాను రాజకీయ నాయకుడినని.. వివిధ పనుల కోసం తన దగ్గరకు ఎందరో వస్తుంటారని చెప్పారు. స్విమ్స్‌లో ఉద్యోగం‌ ఇవ్వాలంటూ రెఫరెన్స్ ఇచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. తాను సిఫారసు చేసినా.. అధికారులు జీవో ప్రకారమే ఉద్యోగాలిస్తారని గుర్తుచేశారు. టీటీడీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయలేదనే తనపై కొందరు కక్ష కట్టారని పుట్టా సుధాకర్ యాదవ్ వాపోయారు. తన మీద వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరారు. తప్పు చేశానని విచారణలో తేలితే.. ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *