తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు .. పోటెత్తుతున్న భక్తులు

Spread the love

MAHA SHIVA RATHRI  CELEBRATIONS IN TELUGU STATES

తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాలు శివనామస్మరణంతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. క్యూలైన్లలో బారులు తీరి నిల్చున్నారు. శ్రీశైలం,పాలకొల్లు, ఒరుగాల్లులోని వెయ్యి స్తంభాల ఆలయం , వేములవాడ రాజన్న ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. శివరాత్రి సందర్భంగా కృష్ణానది, గోదావరి నదులలో భక్తులు నదులలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ రాజన్న క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పవిత్ర స్నానాలు ఆచరించి రాజన్న దర్శనం కోసం బారులు తీరారు. భక్తులు భారీగా తరలిరావడంతో క్యూలైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఉదయం 7 గంటలకు టీటీడీ తరపున రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇక 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి మహా లింగార్చన జరుగనుంది. రాత్రి 11 గంటల తర్వాత లింగోద్భవ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో కూడా మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుండే భక్తులు పోటెత్తారు. దాదాపు 2 లక్షల మంది భక్తులు రుద్రేశ్వరుడిని దర్శించుకుంటారని అంచనా.. భక్తుల సౌకర్యార్ధం అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నారు.

మేడ్చల్‌ జిల్లా కీసర గుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్‌ రోశయ్య పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ ఘట్టాన్ని నిర్వహిస్తారు. యాగశాలలో రుద్రస్వాహకర హోమం, బిల్వార్చన, ప్రబోధకాల పూజ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. భారీ భద్రతతోపాటు.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.ఖమ్మం జిల్లాలోని మధిర శివాలయం మహాశివరాత్రి ఉత్సవ శోభను సంతరించుకుంది . ఇక్కడి శివుడు మృత్యుంజయుడిగా పూజలు అందుకుంటున్నారు. వైరా నది తీరాన ఈ శివాలయం వెలసింది. ఇక్కడ వైరా నది దక్షిణాభిముఖంగా పయనిస్తోంది. దీంతో ఈ ఆలయానికి దక్షిణ కాశీగా పేరు వచ్చింది. 5 రోజుల పాటు ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. నేడు అర్థరాత్రి అత్యంత వైభంగా కళ్యాణం నిర్వహిస్తారు.

శ్రీశైలంలో వైభవోపేతంగా శివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. రాజమండ్రిలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. గోదావరి పుష్కరాల రేవులో పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు తరలివస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి స్నానాలు చేస్తున్నారు.ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శ్రీక్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రికి భక్త జనం పోటెత్తారు . పంచారామ క్షేత్రం శిరోభాగం కావడంతో ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే పంచారామాలు దర్శించుకున్న పుణ్యం వస్తుందని అర్చకులు చెబుతున్నారు. భక్తులకు ప్రసాదాలు, మంచినీళ్ళు, పాలు, మజ్జిగ అందచేస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. శివరాత్రి సోమవారం రావడంతో లక్షమంది భక్తులు వస్తారన్న అంచనాతో.. ఏర్పాట్లను భారీగా చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *