Majili Movie Review Rating

సంస్థ‌:  షైన్ స్క్రీన్స్
న‌టీన‌టులు:  నాగ‌చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాన్ష కౌశిక్‌, పోసాని త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం:  శివ నిర్వాణ‌
నిర్మాత‌:  హ‌రీష్ పెద్ది, సాహు గార‌పాటి
కెమెరా:  విష్ణు శ‌ర్మ‌
ఆర్ట్:  సాహి సురేష్‌
ఎడిటింగ్‌:  ప్ర‌వీణ్ పూడి
సంగీతం:  గోపీ సుంద‌ర్‌, త‌మ‌న్‌
నాగ‌చైత‌న్య‌, స‌మంత `ఏమాయ చేసావె` అంటూ కెరీర్ ప్రారంభంలోనే మేజిక్ చేశారు. ఆ త‌ర్వాత వాళ్లిద్ద‌రూ చేసిన `మ‌నం` కూడా హిట్ అయింది. కానీ వాళ్లు చేసిన `ఆటోన‌గ‌ర్ సూర్య‌` మాత్రం పెద్ద‌గా హిట్ కాలేదు. గ‌త కొన్నేళ్లుగా స‌మంత స‌క్సెస్‌ల‌తో దూసుకుపోతున్న‌ప్ప‌టికీ చైత‌న్య మాత్రం కెరీర్ ప‌రంగా డీలాలోనే ఉన్నారు. `వెధ‌వ‌ల‌కి ఎప్పుడూ మంచి పెళ్లాలు వ‌స్తార‌ని నువ్వే నిరూపించావ్‌` అని `మ‌జిలీ`లో ఓ డైలాగ్‌. ఆ డైలాగ్ ఈ సినిమా మీద హైప్ తెచ్చిపెట్టింది. ఒడుదొడుకుల్లో ఉన్న నాగ‌చైత‌న్య కెరీర్‌లో తాజాగా ఆయ‌న  స‌మంతతో జోడీ క‌ట్టిన `మజిలీ` ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో వేచి చూడాల్సిందే.
క‌థ‌
జ‌గ‌న్నాథం (రావు ర‌మేష్‌) కుమారుడు పూర్ణ (నాగ‌చైత‌న్య‌). చిన్న‌ప్పుడే త‌ల్లిని కోల్పోవ‌డంతో తండ్రి పెంప‌కంలో పెరుగుతాడు. త‌న స్నేహితుల‌తో స‌ర‌దాగా ఉంటూనే క్రికెట్ మీద ఆస‌క్తి పెంచుకుంటాడు. ఐఐటీలో ఎల‌క్ట్రానిక్స్ చ‌దువుతుంటాడు. అత‌ని తెలివితేట‌ల మీద న‌మ్మ‌కంతో తండ్రి అత‌నికి ఏడాది పాటు అవ‌కాశం ఇచ్చి క్రికెట్ ఆడ‌మంటాడు. అత‌ను రైల్వేస్ త‌ర‌ఫున ఆడాల‌నుకుంటాడు. ఆ క్ర‌మంలోనే నేవీ టీమ్‌తో ఆడి, రైల్వేస్ టీమ్‌ని గెలిపిస్తాడు. అంత‌కు ముందే చిన్న త‌ప్పు చేయ‌మ‌ని అన్షు (దివ్యాంశ‌)కు దొరికిపోతాడు. ఆ త‌ర్వాత వారి ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. పెళ్లి చేసుకోవాల‌నుకుంటారు. ఆ స‌మ‌యంలో యూత్ లీడ‌ర్ భూష‌ణ్ (సుబ్బ‌రాజు) వ‌ల్ల వారి ప్రేమ ఇంట్లో వారికి తెలిసిపోతుంది. ష‌రా మామూలుగా విడిపోతారు. అయితే  ఆ ప్రేమ నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేక తాగుడుకు అల‌వాటుప‌డ‌తాడు పూర్ణ‌. అత‌ని జీవితంలోకి శ్రావ‌ణి ప్ర‌వేశించి ఉంటుంది. చేసుకుంటే అత‌న్నే చేసుకుంటాన‌ని అత‌ని జీవితంలోకి వ‌చ్చిన ఆమెను అత‌ను ఏలుకోడు. ఆ త‌ర్వాత వారిద్ద‌రి జీవితంలోకి మీర వ‌స్తుంది. ఇంతకీ మీర ఎవ‌రు?  డెహ్రాడూన్‌కి వెళ్లిన పూర్ణ‌కు, మీర ఎలా ప‌రిచ‌య‌మైంది? ఎప్పుడూ ఒంట‌రిత‌నాన్ని కోరుకుని హోట‌ల్ రూమ్ కి వెళ్లే పూర్ణ ఆఖ‌రి సారి అక్క‌డికి ఎందుకు వెళ్లాడు?  పూర్ణ‌ను అమితంగా ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకున్న శ్రావ‌ణి చివ‌రికి ఏమైంది?  వంటివ‌న్నీ ఆస‌క్తిక‌రం.
విశ్లేష‌ణ‌
ఈ చిత్రంలో ప్ర‌త్యేకించి ప్ల‌స్ పాయింట్లు, మైన‌స్ పాయింట్లు అంటూ ఉండ‌దు. అలాగ‌ని కావాల‌ని వెత‌క‌డం మొద‌లుపెడితే లేకుండానూ ఉండ‌వు. తొలిస‌గం అంద‌రికీ తెలిసిందే. ఎన్నో క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల్లో చూసిందే. రెండో స‌గంలో ఏం జ‌రుగుతుందో కూడా పెద్ద ఊహించ‌ని రాని స‌స్పెన్స్ ఏమీ కాదు. అయితే సుఖంఆంతం, లేకుంటే దుఃఖాంతం… కానీ ఎంద‌రెంద‌రో జీవితాల్లో చూసే ఇలాంటి క‌థ‌ను తెర‌మీద అంత గొప్ప‌గా చెప్ప‌గ‌ల‌గ‌డం శివ నిర్వాణ నేర్ప‌రిత‌నాన్ని చూపిస్తుంది. పెళ్లికి ముందు ప్రేమ‌ను చూపించ‌డానికి స‌వాల‌క్ష మార్గాలు ఉండొచ్చు. పెళ్ల‌య్యాక ఎవ‌రైనా ప్రేమ‌ను ఎలా చూపిస్తారు?  బాధ్య‌త‌గా ఉండా?  ఎదుటివారికి భ‌రోసా ఇచ్చా?  క్లైమాక్స్ లో వ‌చ్చే డైలాగులే ఇందుకు సాక్షి. అన్షు ఇక లేద‌ని తెలిశాక చ‌నిపోదామ‌నుకున్న పూర్ణ‌కు వెంట‌నే శ్రావ‌ణి గుర్తుకొస్తుంది. మార్కెట్లో శ్రావ‌ణిని రౌడీలు ఏడిపిస్తే త‌న భార్య‌ను బాధ‌పెట్టిన వారిని చితక్కొట్టాల‌నే పూర్ణ‌కు అనిపిస్తుంది. అంటే భ‌ర్త‌గా అది అత‌ని బాధ్య‌త‌. త‌న‌కోసం వ‌చ్చిన భ‌ర్త మ‌న‌సులో ఏముందో అర్థం చేసుకుని `నీ జేబులో ఉద‌యాన్నే ఈ వెయ్యి రూపాయ‌లు దొరికాయి` అని అన‌డం ఆ ఇల్లాలి ప్రేమ‌ను చూపిస్తుంది. అలాగే మీరాను త‌న కుమార్తెగా అంగీక‌రించే సీను, మీరా కోసం త‌న భ‌ర్త త‌న ప‌ట్ల న‌టిస్తున్నాడ‌నుకుని కుమిలిపోయే సీను… ప్ర‌తిదీ అందంగానే ఉంది. క‌థ‌లో ఒదిగిపోయింది. పాట‌లు కూడా వేటిక‌వే సినిమాలో చ‌క్క‌గా ఒదిగిపోయాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అక్క‌డ‌క్క‌డా `బొంబాయి` సినిమాలోని ట్యూన్ల‌ను త‌ల‌పించినా, సినిమాను ఎలివేట్ చేసింది. కొడుక్కి తండ్రిగా రావు ర‌మేష్‌, కూతురికి తండ్రిగా పోసాని చ‌క్క‌గా న‌టించారు. నాగ‌చైతన్య ఫ్రెండ్ కేర‌క్ట‌ర్ చేసిన జాండీకి మంచి భ‌విష్య‌త్తు ఉంది. కోచ్‌గా న‌టించిన ర‌విప్ర‌కాష్ కి వ‌య‌సు పెర‌గ‌దేమో. ఎన్ని సినిమాల్లోనో, ఎన్నేళ్లుగానో  చూస్తున్నా మ‌నిషిలో వ‌య‌సు పెరిగిన ఛాయ‌లు ఏమాత్రం క‌నిపించ‌లేదు. అన్నీ కుదిరిన సినిమా ఇది. ష‌డ్ర‌సోపేత‌మైన భోజ‌నంలాగా బావుంది.
రేటింగ్‌: 3/5
బాట‌మ్‌లైన్‌: స‌మ్మ‌ర్‌కి బెస్ట్ `మ‌జిలీ`

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *