టీడీపీకి షాక్ ఇచ్చి టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న మండవ

Mandava Gave shock to TDP and and Joined in TRS

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఉగాది పర్వదినాన సీఎం కేసీఆర్ ఆయనకు పార్టీ కండువాకప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నిజామాబాద్‌ జిల్లాలో కీలక నేతగా ఉన్న మండవ వెంకటేశ్వరరావు డిచ్ పల్లి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి పలుమార్లు గెలుపొందారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా కూడా పనిచేశారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. మండవతోపాటు కాంగ్రెస్ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి కూడా కారెక్కేశారు. గాయత్రి రవి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మండవ వెంకటేశ్వరరావు 2009 నుంచి మండవ వెంకటేశ్వరరావు పోటీకి దూరంగా ఉంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని భావించారు. అయితే పొత్తులోభాగంగా ఆ టికెట్ కాంగ్రెస్ పార్టీకి దక్కించుకుంది.

దీంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే శుక్రవారం తెలంగాణ సీఎం కేసీఆర్ జూబ్లీహిల్స్ లోని మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లారు. సుమారు గంటన్నరపాటు చర్చించారు. అనంతరం పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. కేసీఆర్ తో సమావేశమైన అనంతరం మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరతానని ప్రకటించారు. ప్రకటించిన 24 గంటలలోపే ఆయన కారెక్కేశారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కీలక నేతగా ఉన్న మండవ వెంకటేశ్వరరావు పార్టీ మారడం టీడీపీ గట్టి దెబ్బ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *