MANMADHUDU MOVIE REVIEW
నటీనటులు: నాగార్జున, రకుల్‌ప్రీత్ సింగ్, లక్ష్మి, వెన్నెల కిషోర్, రావు రమేష్ తదితరులు
దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
నిర్మాతలు: నాగార్జున, పి.కిరణ్
సంగీతం: చైతన్య భరద్వాజ్
ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్
నిర్మాణ సంస్థలు: మనం ఎంటర్ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 స్టూడియోస్
విడుదల తేదీ: 9-8-2019
నాగార్జునకు మన్మథుడు సినిమా ఎంత క్రేజ్ తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే. 17 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఇప్పుడు టీవీలో వచ్చినా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో నాగార్జున మళ్లీ మన్మథుడు-2గా రావడంతో ఈ మూవీపై అందరిలో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఊపిరి తర్వాత హిట్ లేని నాగ్.. ఈ మూవీతో హిట్ కొడతారనే అభిప్రాయం వ్యక్తమైంది. పైగా టీజర్, ట్రైలర్ కూడా జనాల్లో ఆసక్తి పెంచింది. ఇక దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చి.ల.సౌ సినిమాతో అందరి దృష్టీ ఆకర్షించి రెండో సినిమాకే నాగార్జునను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. మరి ఇండస్ట్రీలో రెండో సినిమా సెంటిమెంట్ ను రాహుల్ అధిగమించాడా? నాగ్ మళ్లీ హిట్ కొట్టాడా? ఓసారి చూద్దాం..
కథ ఏంటంటే..
సాంబశివరావు అలియాస్ సామ్ (నాగార్జున)ది పోర్ఛ్ గల్ లో స్థిరపడిన తెలుగు కుటుంబం. ప్రేమలో ఓసారి దెబ్బ తినడంతో పెళ్లి జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకుంటాడు. కానీ అమ్మాయిలతో సరసాలు ఆడుతూ ప్లేబాయ్ తరహాలో ఉంటాడు. సామ్ తల్లి (లక్షి) అతడికి వివాహం చేయాలని ప్రయత్నాలు చేస్తుంటుంది. దీంతో అవంతిక (రకుల్) సహాయంతో డ్రామా ఆడాలని సామ్ భావిస్తాడు. ఈ క్రమంలో అవంతిక సామ్ కుటుంబ సభ్యులకు దగ్గరవుతుంది. అనంతరం ఏమి జరిగింది? అవంతిక ఎవరు అనే విషయాలు వెండితెరపై చూడాల్సిందే.
బలాలు
నాగార్జున, రకుల్
వెన్నెల కిషోర్ కామెడీ
బలహీనలు
కథలో కొత్తదనం లేకపోవడం
డబల్ మీనింగ్ జోకులు
భావోద్వేగాలు పండకపోవడం
విశ్లేషణ
పాత మన్మధుడికి ఈ మన్మథుడికి అస్సలు పోలికే లేదు. ఈ విషయాన్ని నాగార్జున కూడా ముందే చెప్పాడు. పేరు తప్ప ఇక సినిమాపరంగా ఎలాంటి సారూప్యతా ఉండదన్నాడు. అయినా, పాత మన్మథుడికి కామెడీయే ప్లస్ అయింది. కానీ ఇందులో అదే మిస్ అయింది. వెన్నెల కిషోర్ కామెడీ బాగానే ఉన్నప్పటికీ, ప్రేక్షకులు ఊహించుకుని వెళ్లేంత స్థాయిలో ఉండదు. పాత మన్మధుడిలో పంచు డైలాగులు, సందర్భానుసారం పేలిన సంభాషణలు ఇందులో కొరవడ్డాయి. పోర్చుగల్ లో సాగే ఈ సినిమాలో మన నేటివిటీ మిస్సయింది. ఇక కొన్ని సన్నివేశాల్లో నాగార్జున లుక్ సైతం ఎబ్బెట్టుగా అనిపించింది. చాలా వరకు డబల్ మీనింగ్ డైలాగులతో కథ నడిపించడం ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు. అసలు ‘మన్మథుడు-2’ కథను ఓ ఫ్రెంచి సినిమా ఆధారంగా తీర్చిదిద్దుకున్నారు కానీ.. అక్కడి నుంచి కంటెంట్ తీసుకునేంత ప్రత్యేకత ఏమీ ఇందులో లేకపోవడం గమనార్హం. సినిమా ప్రారంభమైన తర్వాత కాస్త ఉత్సాహంగానే సాగినా.. రానురాను భారంగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సైతం తేలిపోయింది. ఇక ద్వితీయార్ధంలో ఏ మాత్రం ఉత్సాహం అనేదే కనిపించదు. మధ్య మధ్యలో వెన్నెల కిషోర్.. రావు రమేష్ ల పంచులు లేకుండా ఈ సినిమా పరిస్థితి మరీ ఘోరంగా ఉండేది.
చివరగా..
ఈ మన్మధుడు.. మురిపించలేకపోయాడు