ఆర్టీసీ కార్మికులకు మావోల మద్దతు..

Maoists Support RTC Strike

మిలిటెంట్ ఉద్యమాలు చెయ్యండని పిలుపు  

తెలంగాణా రాష్ట్రం లో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మావోయిస్ట్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ నేపధ్యంలో మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ పేరుతో లేఖ విడుదల చేసింది .  ప్రైవేటీకరణలో భాగంగానే ఆర్టీసీ విలీనం చేయడం లేదని  సిపిఐఎంఎల్   తెలంగాణ రాష్ట్ర కమిటీ  లేఖను విడుదల చేసింది.  ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను సాధించుకునే వరకు  మిలిటెంట్ ఉద్యమాలు  చేపట్టండి అని పిలుపునిచ్చింది. కార్మికుల సమ్మెకు  ప్రజలంతా సంపూర్ణ మద్దతు ప్రకటించాలని  మావోయిస్టు పార్టీ  కోరింది. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ  ఆర్టీసీ కార్మికుల విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.  ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని,  కార్మికులపై కొనసాగిస్తున్న విధానాలను తక్షణమే మానుకోవాలని లేఖలో ప్రకటించింది మావోయిస్టు పార్టీ.

టిఆర్ఎస్ ప్రభుత్వం పై పౌరుల ప్రాథమిక హక్కులను  వాక్ స్వాతంత్య్రాన్ని కాల రాస్తోందని , ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీ నిర్లక్ష్యం  చేస్తోందని  లేఖలో  పేర్కొంది.  ప్రభుత్వమే ఆర్టీసీ యాజమాన్యాన్ని  చెప్పుచేతల్లో పెట్టుకొని,  అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకొని   పెత్తనం చెలాయిస్తున్నదని  మండిపడింది మావోయిస్టు పార్టీ.  అంతేకాదు నియంత ప్రభుత్వాలు ప్రజల ఆవేశానికి గురికాక తప్పదని హెచ్చరికలు జారీ చేసింది.  ఆర్టీసీ కార్మికుల సమస్యల  పరిష్కారం కోసం వీరోచితంగా పోరాటం సాగించాలని,  అవసరమైతే త్యాగాలకు సిద్ధం కావాలని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేర్కొంది. మావోయిస్టు పార్టీ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పట్టించుకోకుండా ఆర్టీసీ నడపడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం  మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికింది.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని,  ఆర్ టి సి లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని,  ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణం చెల్లించాలని,  డీజిల్ వ్యాట్ ను,  మోటారు వాహన పన్నును మినహాయించాలని,  ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్న  కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోగా ఉద్యోగాల నుండి తొలగిస్తామని చెప్పటం   ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని  లేఖలో పేర్కొంది  మావోయిస్టు పార్టీ.  ఇక ఈ నేపథ్యంలోనే  సమస్యలకు పరిష్కారం దొరికేవరకు  మిలిటెంట్ ఉద్యమాలు సాగించాలని  పిలుపునిచ్చింది.

tags: tags: TSRTC strike, kcr, K Chandra Sekhar Rao, Telangana Government, maoist party. CPI (Maoist)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *