మీడియాపై ఉక్కుపాదం ఎవరికి నష్టం?

MEDIA BAN NOT GOOD

ఇటీవల కాలంలో మీడియా కూడా రాజకీయాల్లో భాగమైపోయింది. ప్రతి పార్టీకి ఓ పత్రిక, ఛానల్ ఉండటం కామనైపోయింది. ఆయా మీడియా సంస్థలు తమ తమ పార్టీల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక కథనాలు వస్తుంటే ఏ సర్కారూ సహించడంలేదు. అలా రాసిన సంస్థలను నయానో, భయానో తమ దారిలోకి తెచ్చుకుంటున్నాయి. ఈ విషయంలో ఒకప్పుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుసరించిన వైఖరినే ఇప్పుడు ఏపీ సీఎం జగన్ అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తమకు వ్యతిరేకంగా వ్యవహరించారనే కారణంతో టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానళ్లు రాష్ట్రంలో ప్రసారం కాకుండా కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. కేబుల్ ఆపరేటర్ల ద్వారా తాను అనుకున్నది సాధించగలిగారు. దీంతో టీవీ9 వెంటనే దిగొచ్చి.. సర్కారు పెద్దలతో రాజీ చేసుకుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కొంతకాలం పోరాడినా.. చివరకు ఆ సంస్థ కూడా సర్కారుతో రాజీకొచ్చింది.

ఇప్పుడు ఇదే వైఖరిని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానళ్లు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాకుండా నిలిపివేయించారు. గురువారం సాయంత్రం నుంచి ఆ రెండు జిల్లాల్లో ఈ రెండు ఛానళ్లు రావడంలేదు. డీటీహెచ్ ప్రసారాలు పొందుతున్నవారికి ఈ ఛానళ్లు వస్తున్నా.. మామూలు కేబుల్ టీవీ కనెక్షన్ ఉన్నవారికి మాత్రం ఇవి రావడంలేదు. చలో ఆత్మకూరు వ్యవహారంలో ఈ రెండు ఛానళ్లు పూర్తిగా తెలుగుదేశం పార్టీకే అనుకూలంగా వ్యవహరించడంతో ఆగ్రహించిన ప్రభుత్వ పెద్దలు.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా దనిని విస్తరించే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఈ విషయంలో జగన్ సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము అన్ని విషయాలూ పారదర్శకంగా చేస్తామని ప్రకటించిన జగన్.. మీడియాపై ఇలాంటి వైఖరి తీసుకోవడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఏ మీడియా సంస్థ అయినా తమకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసినా.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించిన ఆయన.. ఇలా ఛానళ్ల ప్రసారాలు నిలిపివేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియాను అణచివేయడం ప్రజలకు నష్టమని చెబుతున్నారు.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *