మీడియాపై విశ్వాసం కోల్పోరాదు

7
Media Shouldn't Loose Faith
Media Shouldn't Loose Faith

Media Shouldn’t Loose Faith

ప్రజలు విశ్వాసం కోల్పోయే విధంగా మీడియా ప్రవర్తించరాదని, పూర్వం పత్రికలపై ఉన్న గౌరవం, ఆదరణను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి సూచించారు. ఆదివారం నాడు జిల్లా కేంద్రమైన వనపర్తి లోని కల్యాణ సాయి గార్డెన్స్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నాడు స్వాతంత్ర సంగ్రామంలో, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మీడియా పోషించిన పాత్ర ఎంతో గొప్పదని, పాత్రికేయులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి అక్షర పోరాటం కొనసాగించారని నిరంజన్ రెడ్డి గుర్తుచేశారు. అలాంటి మహనీయుల వృత్తి ధర్మాన్ని నేటి మీడియా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

* ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, నేడు దేశంలో నల్ల చట్టలతో పాలకులు భావ ప్రకటన స్వేచ్ఛను హరించే కుట్రలకు పాల్పడడం సహించారనిదన్నారు. నాడు ఇందిరాగాంధీ అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడినా, ప్రజలు మాత్రం ఆమెను గద్దె దింపారని, అది కేవలం భావప్రకటన స్వేచ్ఛకు ఆమె భంగం కలిగించినందుకేనని ఆయన స్పష్టం చేశారు. భావప్రకటన స్వేచ్ఛను ఎవరు హరించినా అంతిమంగా పతనం తప్పదనే నిజాన్ని చరిత్ర చెబుతుందన్నారు. భావప్రకటన స్వేచ్ఛా,     వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకై దేశంలో ఐజేయూ రాజీలేని పోరాటాలు చేస్తున్నట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ మాట్లాడుతూ జర్నలిస్టుల పక్షపాతిగా నిలబడి వారి సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న ఏకైక సంస్థ టీయూడబ్ల్యూజే మాత్రమేనని అన్నారు.

* యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ మాట్లాడుతూ పోరాటాలు, త్యాగాలు, విజయాల కలయికే టీయూడబ్ల్యూజే అన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో దాదాపు 60 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగివున్న తమ సంఘం దేశస్థాయిలో పేరు, ప్రతిష్టలు సంపాదించడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా జర్నలిస్టులు పొందుతున్న సౌకర్యాలన్నీ తమ సంఘం పోరాట ఫలితంగానే అని ఆయన పేర్కొన్నారు. ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ విలేఖరుల పునాదులపై నిర్మితమైన తమ సంఘం వారి సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తున్నట్లు తెలిపారు. యూనియన్ వనపర్తి జిల్లా శాఖ అధ్యక్షుడు మధుగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, యూనియన్ రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, హెచ్.యు.జె కార్యదర్శి శిగ శంకర్ గౌడ్, వనపర్తి జిల్లా నాయకులు కొండన్న, నోముల రవీందర్ రెడ్డి, పొలిశెట్టి బాలకృష్ణ, కొంతం ప్రశాంత్, బాలమోని రమేష్, గద్వాల్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్, నారాయణపేట జిల్లా కన్వీనర్ యాదయ్య, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి, నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి రాములు తదితరులు పాల్గొన్నారు.

Telangana Media Role