metro stories
కథలు రెండు రకాలు.. ఒకటి చదివేది.. రెండు చూసేది. ఈ రెండు కలిసిన అంశాలు అరుదుగా ఉంటాయి. అలాంటి అరుదైన అంశమే.. మెట్రో కథలు. పలాస 1978తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న కరుణకుమార్ దర్శకత్వంలో వస్తోన్న వెబ్ ఫిల్మే ఈ మెట్రో కథలు. ఖదిర్ బాబు రాసిన కథలకు వెబ్ రూపంగా రాబోతోన్న ఫిల్మ్ ఒక సిటీలోని నాలుగు కథల సమాహారంగా రాబోతోంది. లేటెస్ట్ గా ఈ వెబ్ ఫిల్మ్ టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఏ దర్శకుడికైనా ఓ ప్రత్యేక ముద్ర ఉంటుంది. అది కొన్ని సినిమాలు చేసిన తర్వాత కనిపిస్తుంది. కానీ తొలి సినిమాతోనే తనదైన ముద్ర వేసిన దర్శకుడు కరుణ కుమార్. తొలి సినిమాతోనే అద్భుతమైన ప్రశంసలు అందుకున్నాడు కరుణ కుమార్. తను స్వతహాగా రచయిత కావడంతో ఒక సున్నితమైన అంశాన్ని కాలమాన పరిస్థితుల్లో కుదించి.. ఆకట్టుకునేలా చెప్పిన సినిమా పలాస 1978. ఈ మూవీతోనే సినిమా పరిశ్రమలో తన జర్నీ ఎలా ఉంటుందో ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చిన కరుణకుమార్ రెండో ప్రయత్నంగా వెబ్ ఫిల్మ్ తో వస్తుండటం విశేషమే.
వెబ్ ఫిల్మ్ అంటే ఇప్పుడు వస్తోన్న సిరీస్ లకు, అక్కడ విడుదలవుతోన్న సినిమాల్లా కాకుండా చాలా భిన్నమైన కాన్సెప్ట్ తోనే వస్తుందని తెలుస్తోంది. నాలుగు కథలే అయినా.. ఇది మెట్రో జీవనాన్ని అద్దం పడతాయి అంటున్నారు. ఒక్కో జీవిత కథ ఒక్కో వర్గానికి ప్రతినిధిలా కనిపిస్తుందనేలా ఈ టీజర్ చూస్తే తెలుస్తుంది. ఆ విషయాన్ని తనదైన శైలిలో ప్రభావవంతంగా చెప్పాడట కరుణ కుమార్. ఇక రచయితగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఖదిర్ ఇంతకు ముందు ఓనమాలు అనే సినిమాకు రాసిన మాటలు చాలు.. అతని ప్రతిభేంటో తెలియడానికి. అలాంటి ఈ ఇద్దరి కాంబోలో వస్తోన్న ఈ వెబ్ ఫిల్మ్ ఈ నెల 14అర్థరాత్రి నుంచి ఆహా ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ కాబోతోంది. మరి ఈ కొత్త ప్రయత్నం ఎలాంటి ఒరవడికి దారి తీస్తుందో చూడాలి.