Modi May Loose in Bihar
– పాల్వాయి రాఘవేంద్ర రెడ్డి
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు భారత రాజకీయాల్లో సరికొత్త లక్షణాలను కనబరుస్తున్నాయి. ముఖ్యంగా అది రాష్ట్రంలోని అధికార కూటమిలో కనిపించడం విశేషం! ఎన్డీయే కూటమికి భారతీయ జనతా పార్టీ తరఫున సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధాన ప్రచారకుడిగా ఉన్నారు. అయినా, ఈసారి ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భావనతో పలాయనవాదాన్ని అందుకున్నట్లుగా కనిపిస్తోంది.
మోదీ నేతృత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రతిసారీ వివిధ అసెంబ్లీ ఎన్నికలలో తమ ప్రధాన ప్రచారాస్త్రాలుగా మతం, జాతీయ భద్రతలనే వాడుకుంటోంది. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కాషాయ పార్టీ పాకిస్థాన్, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను ప్రచారాంశాలుగా వాడుకుంది. ఈ రాష్ట్రంలో తాము బోలెడంత అభివృద్ధి చేశామంటూ మోదీ అండ్ కో దాన్ని ఒక మెరిసే ఉదాహరణగా చూపించుకుంటూ “గుజరాత్ మోడల్” అభివృద్ధి అని బాకాలు కొట్టుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు అది కేవలం ముఖ అందం మాత్రమేనని తేలిపోయింది. విమానాశ్రయం నుంచి ట్రంప్ వెళ్లే మార్గంలో మురికివాడలు కనిపించకుండా ఉండేందుకు ఏకంగా గోడలు కట్టారు!
ఈసారి యువకుడైన తేజస్వి యాదవ్, ఆయన కూటమి భాగస్వాములు కలిసి సరైన ఎన్నికల వ్యూహం రూపొందించకపోయి ఉంటే, బీజేపీ గతంలో ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో చేసినట్లు, 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన పశ్చిమబెంగాల్లో ఇప్పుడు చేస్తున్నట్లు మరోసారి మతం, జాతీయవాదాలను ఎత్తుకునేది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడైన తేజస్వి యాదవ్ సరైన సమయంలో ‘ఉద్యోగాలు’, ‘స్థానిక అభివృద్ధి’ అనే రెండు అంశాలను తెరపైకి తెచ్చారు. యువతకు 10 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి అయితే మొదటి మంత్రివర్గ సమావేశంలోనే ఈ హామీని నెరవేరుస్తానని కూడా అన్నారు.
రికార్డు స్థాయిలో నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని ఆశపడుతున్న నితీష్‌కుమార్ తన వయసులో సగం కూడా లేని రాజకీయ ప్రత్యర్థిపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు! లాలూ ప్రసాద్ యాదవ్‌కు 8-9 మంది పిల్లలున్నారని, ప్రతిసారీ ఆడపిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కొడుకులు పుట్టాలనుకునేవారంటూ పరోక్షంగా అసహ్యమైన వ్యాఖ్యలు చేశారు. అయితే తేజస్వి యాదవ్ చాలా తెలివిగా ఈ వ్యవహారంలోకి ప్రధానమంత్రి నరేంద్రమోదీని లాగారు. ఆయనకూ సుమారు 5-6 మంది సోదర సోదరీమణులున్నారని గుర్తుచేశారు.
అయితే, ఈసారి బీహార్ ఎన్నికల్లో బాగా గుర్తించాల్సిన అంశం ఏమిటంటే, ఈసారి ఎన్నికల ప్రచారంలో బీజేపీ తీసుకుంటున్న అంశాలు. నితీష్‌కుమార్‌పై అవినీతి, అసమర్థపాలన గురించి తగినన్ని విమర్శలు ఇప్పటికే ఉన్నాయి; కానీ బీజేపీ, దాని నేతలు, ముఖ్యంగా ప్రధాని మోదీ కూడా తాము పూర్తి కాలం అధికార పక్షంలో భాగస్వాములం కాదంటూ సాకులు చెబుతున్నారు. ఎన్నికల ప్రచార సభలో ఓసారి నితీష్‌కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) ప్రభుత్వంలో బీజేపీ మూడేళ్లు మాత్రమే ఉందని చెబుతూ, తద్వారా ఎన్నికల ఓటమి ఎదురైతే దాన్నుంచి తప్పించుకోడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
బీహార్ నుంచి వస్తున్న అనేక నివేదికలను బట్టి చూస్తుంటే నితీష్‌కుమార్ సుదీర్ఘ పాలన పట్ల ప్రజలు ఇప్పటికే విసుగెత్తిపోయారని, ఆయనకు ఈసారి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని బీజేపీ నాయకులు నమ్ముతున్నట్లు తెలుస్తోంది. దాంతో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఫల్యాలతో తమకు సంబంధం లేదని, అందువల్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆయన ‘జాతీయవాద’ సిద్ధాంతాలు చూసి ఓట్లేయాలని అడిగేలా ఉన్నారు.
దురదృష్టవశాత్తు, రాష్ట్రంలో అల్లుతున్న కథనాలకు, బీహార్ రాజకీయ పొత్తులకు మాత్రం చాలా తేడా కనపడుతోంది. నితీష్‌కుమార్ చాలాకాలంగా బీజేపీ, ఎన్డీయే భాగస్వామి. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆయన కేంద్రమంత్రి. తర్వాత 2005లో బీహార్ పగ్గాలు అందుకున్నారు. 2005 నుంచి మోదీ ప్రధాని అభ్యర్థిగా వచ్చిన 2013 వరకు నితీష్‌కుమార్ కాషాయదళంతోనే కలిసి ఉన్నారు. కేవలం రెండు మూడేళ్ల స్వల్పకాలం మాత్రమే నితీష్ బీజేపీ నుంచి దూరం జరిగి, లాలూప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్జేడీతో పొత్తుపెట్టుకున్నారు.
ఇప్పుడు గడుస్తున్న ప్రతి ఒక్క రోజూ చాలా కష్టంగా మారడంతో, బీహార్ ప్రజల్లో నితీష్‌పై ఉన్న అసంతృప్తి తమ విజయావకాశాలను దెబ్బతీయకుండా ఉండేందుకు వీలైనన్ని వంకలు వెతుక్కుంటోంది. మరోవైపు లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ నితీష్‌కుమార్‌కు ప్రత్యర్థిగా మారడం ఒకరకంగా నితీష్‌ను దెబ్బకొట్టే కుట్రలాగే కనిపిస్తోంది. రాష్ట్రంలో ఏకైక అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించేందుకు ఎల్జేపీ ఉపయోగపడేలా కనిపిస్తోంది. బీజేపీ, ఎల్జేపీ, నితీష్ ఎవరికి వారే తమ సొంత రాజకీయాలు చేస్తుండగా.. యువనాయకుడైన తేజస్వి యాదవ్ మాత్రం వారందరినీ ఉద్యోగావకాశాలు, అభివృద్ధి అనే రెండు అస్త్రాలతో సరిగ్గా కట్టిపారేశారు. ఇక ఇప్పుడు బీహార్ ప్రజలు ఎటు మొగ్గుతారో, వారి భవిష్యత్తులో ఏం రాసిపెట్టి ఉందో వాళ్లే తేల్చుకోవాలి.
(రచయిత రాజకీయ కమ్యూనికేషన్ల నిపుణుడు; తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర భారతీయ రాష్ట్రాలలో పనిచేశారు)