శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని

Spread the love

MODI VISITS TIRUMALA

  • మోదీకి గవర్నర్, ఏపీ సీఎం ఘన స్వాగతం
  • ప్రధాని హోదాలో మూడోసారి తిరుమల వచ్చిన నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీలంక నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గంలో తిరుపతి బయలుదేరిన మోదీ.. అక్కడ బీజేపీ ఏర్పాటు చేసిన ప్రజా ధన్యవాద సభలో పాల్గొన్నారు. అనంతరం తిరుమల చేరుకుని పద్మావతి అతిథిగృహానికి వెళ్లారు. తర్వాత అక్కడ నుంచి నేరుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ గవర్నర్ నరసింహన్, సీఎం జగన్, టీటీడీ ఈవో సింఘాల్ తదితరులు మోదీకి స్వాగతం పలికారు. అనంతరం వారంతా కలిసి మహాద్వారం నుంచి లోనికి వెళ్లారు. తొలుత ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం గర్భ గుడిలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలోకి వచ్చిన మోదీ, నరసింహన్, జగన్ కు అర్చకులు వేద మంత్రోచ్ఛారణ నడుమ ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రధాని హోదాలో మోదీ తిరుమల మూడోసారి వచ్చారు. రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాత్రం తొలిసారిగా శ్రీవారి దర్శనానికి వచ్చారు. శ్రీవారి దర్శనం పూర్తిచేసుకున్న తర్వాత మోదీ తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, ప్రత్యేక విమానం ఢిల్లీ వెళ్లారు. విమానాశ్రయంలో ఆయనకు సీఎం జగన్ తదితరులు వీడ్కోలు పలికారు.

NATIONAL NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *