ముంబై సూపర్ విక్టరీ

MUMBAI GOES TO PLAY OFF

  • సూపర్ ఓవర్లో సన్ రైజర్స్ పై ఘన విజయం
  • ప్లేఆఫ్ కి చేరిన రోహిత్ సేన

ఐపీఎల్ తాజా సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ కి చేరింది. గురువారం సన్ రైజర్స్ తో ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో విజయం సాధించడతో రోహిత్ సేన ప్లే ఆఫ్ కి అర్హత సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ ఫలితం నిర్ధారించడానికి సూపర్ ఓవర్ అవసరమైంది. అనూహ్యంగా ఈ సూపర్ ఓవర్లో హైదరాబాద్ చతికిలపడటంతో ముంబై నేరుగా ప్లే ఆఫ్ చేరింది. కీలకమైన ఈ మ్యాచ్ లో ఓడిపోవడంతో ప్లే ఆఫ్ అవకాశాలను హైదరాబాద్ సంక్లిష్టం చేసుకుంది. అంతకుముందు టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. మంచి హిట్లర్లు ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో పరుగులు చేయంలో విఫలమైంది. ఓపెనర్ డికాక్ (58 బంతుల్లో 69 నాటౌట్) మినహా మిగిలినవారు పెద్దగా రాణించలేదు. రోహిత్ శర్మ (24), సూర్యకుమార్ (23), హార్థిక్ పాండ్యా (18) మెరుపులు మెరిపించినా, భారీ స్థాయిలో పరుగులు చేయలేకపోయారు. దీంతో ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్‌ ఖలీల్‌ అహ్మద్‌ 3 వికెట్లు తీశాడు.

తర్వాత 163 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ ధాటిగానే ఆడింది. పది ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. అయితే, ఈ దశలో స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. దీంతో చివరి ఐదు ఓవర్లలో 57 పరుగులు అవసరమయ్యాయి. మనీశ్ పాండే (47 బంతుల్లో 71 నాటౌట్) ధాటిగా ఆడుతుండటంతో విజయం ఖాయమనే భావించారు. ఈ దశలో చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా.. ఐదు బంతుల్లో 10 పరుగులు చేసింది. ఆఖరి బంతికి 7 పరుగులు చేయాల్సి ఉండగా.. మనీశ్ పాండే అద్భుతంగా సిక్సర్ కొట్టడంతో మ్యాచ్ టై అయింది. దీంతో ఫలితం తేల్చడానికి ఒక్కో ఓవర్‌తో కూడిన సూపర్‌ ఓవర్‌ను ఆడించారు. ఈ సూపర్‌ ఓవర్‌లో ముంబై మూడు బంతుల్లోనే గెలిచింది. సూపర్ ఒవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. నాలుగు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి 8 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన ముంబై.. మూడు బంతుల్లోనే 9 పరుగులు చేసి విజయం సాధించింది. బుమ్రాకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. చెన్నై, ఢిల్లీ, ముంబై ప్లే ఆఫ్‌ దశకు చేరుకోవడంతో… మిగిలిన మరో బెర్త్‌ కోసం నాలుగు జట్లు హైదరాబాద్, పంజాబ్, కోల్‌కతా, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లు పోటీపడుతున్నాయి.

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *