Mumbai Indians
పదునైన బౌలింగ్, మెరుగైన బ్యాటింగ్, చురుకైన ఫీల్డింగ్, పరిస్థితికి తగ్గట్టు ఆటలో మార్పులు… ఇలా అన్ని సమతూకంలో ఉంటే అలాంటి జట్టును ఎవరైనా ఆపగలరా…? ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఆటతీరు కూడా ఇలానే కొనసాగుతోంది. డిపెండింగ్ చాంపియన్ కు తగ్గట్టుగా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వరుసగా ఐదు విజయాలను నమోదు చేసి టాప్ గేర్ దూసుకుపోయింది. ఇదంతా ముంబై ఇండియన్స్ కు ఎలా సాధ్యమైంది?
జట్టంతా సమతూకంగా
ఏ జట్టయినా స్టార్ క్రికెటర్ పై ఎక్కువగా ఆధారపడుతుంది. ముంబై జట్టులో స్టార్ ఆటగాళ్లు, అనుభవం లేని ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ఏ ఒక్కరిపై ఆధారపడటం లేదు. పరిస్తితులకు తగ్గట్టు, పిచ్ ను బట్టి బౌలింగ్, బ్యాటింగ్ లో మార్పులు చేసుకుంటూ జట్టు ఆటగాళ్లు తమ పనిచేసుకుంటూ పోతున్నారు. బలహీనతలను పక్కన పెట్టి బలాలపై ఎక్కువ ఫోకస్ చేస్తోంది ముంబై ఇండియన్స్. అందుకే వరుసగా ఐదు విజయాలను నమోదు చేసింది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత గత మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలిచింది. దీనికి విరుద్ధంగా ముంబై ఇండియన్స్ వరుసగా ఐదో విజయం సాధించింది.
పటిష్టంగా రోహిత్ సేన
ముంబై అద్భుత ఆటతీరుకు నిన్న జరిగిన మ్యాచ్ ఒక ఉదాహరణ. నిన్న జరిగిన పోరులో రోహిత్ సేన 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 16.5 ఓవర్లలో 2 వికెట్లకు 149 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ డికాక్ (44 బంతుల్లో 78 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగాడు. ఇలా ప్రధాన బ్యాట్లమన్లంతా సమయం వచ్చినప్పుడు అద్భుతంగా ఆడుతూ ముంబైకు విజయాలను అందిస్తున్నారు.