Must Protect Education Field
కోవిడ్ సంక్షోభంతో అనేక రంగాలతో పాటు విద్యారంగం కూడా దెబ్బతిన్నదని, విద్యార్ధుల భవిష్యత్ కు కీలకమైన విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు. నాణ్యమైన చదువు, ఉద్యోగితా నైపుణ్యాల అభివృద్ధితోనే ప్రస్థుత సంక్షోభ, పోటీ ప్రపంచంలో రాణించగలమని, విద్యార్ధులను ఆవిధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనపైన ఉందన్నారు. శనివారం “కోవిడ్ సంక్షోభం: విద్యారంగంపై ప్రభావం” అన్న అంశంపై గ్లోబల్ వెబినార్ లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో తరతరాలుగా విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, ఈ సంక్షోభ సమయంలోనూ విద్యార్ధులు పరిమిత వనరులతోనే ఆన్ లైన్ లో విద్యాభ్యాసం చేయడానికి ఉత్సాహం చూపారని గవర్నర్ ప్రశంసిచారు.
“ఆన్ లైన్ విద్యాభ్యాసంలో పేదలు వెనకపడకుండా చూడాల్సిన బాధ్యత అందరికీ ఉంది” అని అన్నారు. ఆన్ లైన్ క్లాసులలో కేవలం 60 శాతం మందికి మాత్రమే అందుబాటులో ఉన్నామని, మిగతా 40 శాతం మందికి విద్య దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. విద్యార్ధులు కళాశాలను, స్నేహితులను ఎంతగానో మిస్ అవుతున్నందున, వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటానికి తల్లితండ్రులు, టీచర్లు సమిష్ఠిగా కృషి చేయాలని డా. తమిళిసై పిలుపునిచ్చారు.
ఆన్ లైన్ విద్యను అందుకోలేని వారికి డిజటల్ లైబ్రరీలు ఏర్పాటు చేసి, ప్రత్యేక శ్రద్ధ ద్వారా సమ్మిళిత విధానం అవలంబించాలని కోరారు. ఈ అంతర్జాతీయ వెబినార్ ను లీడ్ ఇండియా ఫౌండేషన్ (అమెరికా విభాగం) ఛైర్మన్ డా. హరి ఎప్పనపల్లి నిర్వహించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య వక్తగా రాష్ట్ర ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్ పాల్గొన్నారు.
మొత్తం 17 దేశాల నుండి వందలాది మంది ఈ వెబినార్ లో భాగస్వాములైనారు.