టఫ్ ఫైట్ ఇవ్వనున్న నల్గొండ ఎమ్మెల్సీ స్థానం

Nalgonda MLA position to give tough fight

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు మరోసారి టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ కు తెరలేపాయి. నల్లగొండ నియోజకవర్గం నుంచి గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైన తేరా చిన్నపరెడ్డిని తిరిగి టీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీ పేరును ఫైనల్ చేశారు. పోటీ పాత వారి మధ్య అయినా పోరు మాత్రం కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్య కొనసాగుతోంది.

తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న శాసనమండలి ఎన్నికలు రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. నల్లగొండ స్థానిక ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఖాళీ ఏర్పడింది. తిరిగి ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పోటీ పడుతుండగా ఇక్కడి నుంచి గెలుపొంది సత్తా చాటాలని టీఆర్ఎస్ భావిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయిన తేరా చిన్నపరెడ్డి తిరిగి ఇక్కడి నుంచి టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి పోటీకి సిద్ధమయ్యారు. 2016లో జరిగిన ఎన్నికల్లోనే పోటీ రసవత్తరంగా సాగింది. అప్పటి ఎన్నికల సమయం నాటికి 1,110 మంది స్థానిక ఓటర్లు ఉన్నారు. వీరిలో మెజార్టీ ఓటర్లు కాంగ్రెస్ నుంచి గెలిచిన వారున్నారు.

ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేథ్యంలో మెజారిటీ సభ్యులు టీఆర్ఎస్ లో చేరారు. తాజాగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓట్లు తగ్గినా విజయం సాధిస్తామన్న విశ్వాసం గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది. మరో వైపు టీఆర్ఎస్ కు ధీటుగా కోమటిరెడ్డి ఫ్యామిలి రాజకీయ ఎత్తుగడలతో ముందుకు పోతున్నారు. ఇరువురు నేతలు ఆర్ధికంగా పలుకుబడి ఉన్న వారు కావడంతో క్యాంపు రాజకీయాలు జోరందుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అవసరమైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌన్సిలర్లను తమవైపు మళ్లించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు ఇరు పార్టీల నేతలు. మొత్తంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు మరింత ఆసక్తిని కల్గించబోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *