కాశ్మీర్ గవర్నర్ గా నరసింహన్?

NARASIMHAN MAY KASHMIR LG

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా యోచిస్తున్నట్టు సమాచారం. జమ్మూ కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ లేకుండా లడఖ్ ను ఓ కేంద్ర పాలిత ప్రాంతంగా, జమ్మూ కాశ్మీర్ ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా విభజిస్తూ కేంద్రం తీర్మానాలు చేసింది. ఈ నేపథ్యంలో కాశ్మీర్ కు ఓ సమర్థుడైన వ్యక్తిని గవర్నర్ గా నియమించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు తెలంగాణ గవర్నర్ నరసింహన్ సరైన వ్యక్తి అని యోచిస్తున్నట్టు సమాచారం.

మాజీ ఐపీఎస్ అధికారి అయిన నరసింహన్ అయితే, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సమర్థంగా సేవలు అందించగలరని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా ఉన్న నరసింహన్ ను ఏపీ బాధ్యతల నుంచి తప్పించి, తెలంగాణకు పరిమితం చేసింది. గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా, కేంద్ర హోంశాఖలో వివిధ స్థాయిల్లో పనిచేసిన అనుభవం నరసింహన్ కు ఉండటం ఈ విషయంలో ఆయన పట్ల కేంద్రం మొగ్గు చూపడానికి ప్రధాన కారణమని అంటున్నారు. పైగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు నరసింహన్ సన్నిహితుడు కూడా. ఇక ఉమ్మడి ఏపీ విభజన సమయంలో గవర్నర్ గా ఉన్న నరసింహన్ కు విభజన సమస్యలు, వాటి పరిష్కారాలపై మంచి అవగాహన ఉంది. ఈ కారణాలన్నింటి నేపథ్యంలో నరసింహన్ ను కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించడం దాదాపు ఖాయమనే ప్రచారం సాగుతోంది.

NATIONAL NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *